మేడ్చల్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పక్రియకు గాను అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలో కొంత ప్రాంతం వచ్చే శేరిలింగపల్లి, ఎల్బీనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులకు నియమించారు. నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల దరఖాస్తుల పూర్తి అనంతరం, ప్రత్యేక అధికారులు దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది.
త్వరలోనే స్కీంపై అవగాహన కార్యక్రమాలు..
దళిత బంధు పథకంలోకి వచ్చే స్కీంలపై అవగాహన కార్యక్రమాలను త్వరలోనే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికను ఖారారు చేశారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసిన అనంతరం, దరఖాస్తులను పరిశీలించేందుకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దళితబంధు పరిధిలోకి వచ్చే 90 రకాల వివిధ వ్యాపారాలపై ముందుగానే అవగాహన కల్పించనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో 5,500 మంది లబ్ధిదారులతో పాటు శేరిలింగపల్లి, ఎల్బీనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిని బట్టి లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. అయితే గతంలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారులు నిర్వహిస్తున్న వ్యాపారాలలో ఆర్థికంగా ఎదిగన వారిని అవగాహన కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు చూస్తున్నారు.