సిటీబ్యూరో, జనవరి 13 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హద్దు దాటుతున్నాయి. విద్యా శాఖ నిబంధనలు తమకేమీ వర్తించవంటూ చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రణాళికలను పాటించకుండా పెడ చెవిన పెడుతున్నాయి. కనుమ పండగ రోజున కూడా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి కొన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయంటే వాటి పైశాచికత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పల్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లోని స్కూల్స్.. ముఖ్యంగా ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూల్స్ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖతో సంబంధం లేదన్నట్టుగా బాహటంగానే ప్రకటిస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మాత్రం తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుంది. నిబంధనల కు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుంది. ముఖ్యంగా ఉప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాల కనుమ రోజున పరీక్ష నిర్వహిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పండుగ రోజు పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. తమ ఇష్టానుసారంగా నిర్వహిస్తామని.. మీకు ఇష్టం లేకుంటే అడ్మిషన్ రద్దు చేసుకోవచ్చని బెదిరిస్తున్నారు. మరో ప్రైవేట్ స్కూల్ సంక్రాంతి సెలవులు కేవలం రెండు రోజులు మాత్రమే ప్రకటించాయి.
కనుమ నుంచి పాఠశాలలు ప్రారంభమనే సందేశాలు పంపించాయి. ఇదేంటని అడిగితే క్రిస్మస్కు పది రోజుల వరకు సెలవు లు ఇచ్చాం కాబట్టి.. ఈ సారి ఇంతేనని యాజమాన్యం చెబుతుందని తల్లిండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిపై జిల్లా విద్యా శాఖాధికారికి ఫిర్యాదులు సైతం చేసినట్టు పేర్కొన్నారు. ప్రభు త్వం 11 నుంచి 17 వరకు సెలవులు ప్రకటిస్తే వీటిని కొన్ని స్కూల్స్ పట్టించుకోకపోవడం బాధాకరం. మరికొన్ని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు అయ్యప్ప మాల ధరించినందుకుగాను ఆ విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకుండా ఇంటికి పంపించిన సంఘటనలు ఉన్నాయి. వీటిన్నింటిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు.