City Police | సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కత్తి పట్టే రౌడీలతో కొందరు ఖాకీలు దోస్తీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కొందరు పోలీసులు.. రౌడీలతో చట్టాపట్టాలేసుకుంటూ తిరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న కొంతమంది రౌడీషీటర్లు ఆదిపత్యం కోసం గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకొని.. ప్రతీకార దాడులు, హత్యలు చేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
పండుగలు, వేడుకల సమయంలోనే రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దీంతో కొంతమంది రౌడీషీటర్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకొని.. సత్ ప్రవర్తనతో నడుచుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి.. వారిపై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు ఎత్తివేస్తున్నారు. ప్రవర్తన మార్చుకొని రౌడీషీట్లను కొనసాగిస్తూ.. నేరాలకు పాల్పడుతున్న వారిపై కొత్తగా కూడా రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లోని కొంతమంది రౌడీషీటర్లు క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసు సిబ్బందితో స్నేహంగా ఉంటూ.. స్థానికంగా తమ పట్టు కొనసాగిస్తున్నారు. దీంతో రౌడీషీటర్లు వారికి కావాల్సిన చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా.. క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులను ఆర్థిక సహకారంతో పాటు, విందు, పొందుతో మెప్పిస్తున్నారు. కొన్ని ఠాణాల పరిధిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, బీట్ కానిస్టేబుల్, ఆయా ఠాణాల పరిధిలో ఉండే ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులు కూడా రౌడీషీటర్లతో దోస్తీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల దోస్తీని అవకాశంగా తీసుకుంటున్న రౌడీషీటర్లు.. సామాన్య ప్రజలను వేధిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. బాలానగర్ జోన్లో ఉన్న ఒక రౌడీషీటర్ 30 మందితో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నాడని అక్కడి ప్రజలు తెలిపారు.
బాలానగర్ జోన్లో గతంలో ఓ నాయకుడిని హత్య చేసి, జైలుకు వెళ్లి వచ్చిన రౌడీషీటర్, మరో హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సెటిల్మెంట్ వివాదంలో ఓ వ్యక్తి గొంతు నరాన్ని కోశాడు. బాధితుడు పక్షవాతానికి గురయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబం రోడ్డున పడింది. ఇలాంటి నేరాలకు పాల్పడటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఈ రౌడీషీటర్ అంటే భయం మొదలయ్యింది. ప్రజలను భయపెట్టేందుకు అతడు 30 మందితో ఓ గ్యాంగ్‌ను తయారు చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌తో అటూ సైబరాబాద్, ఇటూ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసు సిబ్బందితో దోస్తీ చేస్తున్నాడు. పోలీసుల సహకారం ఉండటంతో అనుకున్నది సాధిస్తున్నాడు. ఈ రౌడీషీటర్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనానికి సంబంధించిన కేసులున్నాయి. అయినా.. పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ రౌడీషీటర్ జైలుకు వెళ్లిన సమయంలో అక్కడున్న పాత రౌడీషీటర్లను దోస్తీ చేసుకున్నాడు. ఇలా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పలువురు రౌడీషీటర్లతో దోస్తీ చేసిన ఈ రౌడీషీటర్ నేర సామ్రాజ్యం నెమ్మదిగా ట్రై పోలీసు కమిషరేట్ల పరిధిలో విస్తరించింది. ఇతడు తొలుత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసులతో దోస్తీ చేసి వారికి కావాల్సిన మాముళ్లు ఇస్తూ.. ఇతడికి కావాల్సిన పనులు చేసుకుంటూ స్థానికంగా ఉండే ప్రజల్లో భయం పుట్టిస్తున్నాడు. కిందస్థాయి పోలీసు సిబ్బంది సహాయంతో కొంతమంది పెద్ద అధికారుల సహాయం కూడా తీసుకుంటూ పోలీసులతో మర్యాదలు అందుకుంటున్నాడని ప్రజలు చెబుతున్నారు.
ఈ రౌడీషీటర్‌పై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఠాణా నుంచి ఆ సమాచారం రౌడీషీటర్‌కు చేరుతోంది. పోలీసులు కూడా రౌడీషీటర్కే మద్దతు పలుకుతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఎవరైనా మాట వినకపోతే.. నా కత్తికి పని చెప్పమంటవా.? అంటూ బెదిరిస్తున్నాడని తెలిసింది. స్థానికంగా అక్రమ నిర్మాణాలపై ఎవరైనా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారంటే చాలు.. ఈ రౌడీషీటర్ ఈజీగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి.. మావాడి ఇల్లు కూల్చేస్తామని చెప్పారంటా.. అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను తెలుసుకుంటున్నాడు. ఆ తర్వాత సదరు ఫిర్యాదుదారు ఫోన్‌నంబర్ తీసుకొని బెదిరిస్తున్నాడు. ఈ రౌడీషీటర్ వేధింపులు ఎక్కువయ్యాయని, స్థానిక పోలీసులు కూడా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.