విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వినియోగదారులకు అసలు రుసుము తెలియకుండా లక్షల్లో అదనంగా వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఈ దందా జరుగుతుంటే ఉన్నతాధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా అంటే లేదని వారికి కూడా ఇందులో వాటా ఉంటుందంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చించుకుంటున్నారు. మోసపోయిన వినియోగదారులకు న్యాయం చేయాల్సిన డిస్కం పెద్దలు మళ్లీ అదే దందా కొనసాగేలా పరోక్షంగా ఊతమిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సిబ్బంది తమకు వచ్చే డబ్బులు పోతాయన్న ఆలోచనతో కాంట్రాక్టర్లతో కుమ్మకై ప్రజలను దోచుకుంటున్నారంటూ కొందరు వినియోగదారులు చెబుతున్నారు.
– సిటీబ్యూరో
సిటీబ్యూరో, మార్చి 27(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో నెలనెలా ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నంబర్ 7981893459తో కొత్త కరెంటు కనెక్షన్ల కోసం డిస్కంకు ఏకంగా 1928 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కడా వినియోగదారుల నంబర్లు రాయలేదు. కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ రీడర్ నంబర్‌కు ఎంత కట్టాలనేది ఎస్ఎంఎస్ వెళ్తుంది. దీంతో ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికే మొదట కొత్త కనెక్షన్ ఇస్తున్నారు. ఈ విషయంపై ఆ మీటర్రీడర్ను సంప్రదిస్తే తాను చాలారోజుల కిందటే బంద్ చేశానని, ఈ నంబర్లతో తనకు సంబంధం లేదని చెప్పాడు. కానీ తన పై అధికారులు చెప్పినట్లుగా వినియోగదారులకు అవసరమైన కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అతని నంబర్ పెట్టడంతో అతనికే ఓటీపీ వచ్చేదని తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున నార్సింగి, ఇబ్రహీంబాగ్, మోకిలా, పటాన్చెరు, కొల్లూరు, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్, యూసుఫ్‌గూడ, కొండాపూర్, తారానగర్, అల్లాపూర్ తదితర సెక్షన్ల పరిధిలో ఒక వ్యక్తి తన ఫోన్ నంబర్ 9885584049తో కనెక్షన్ల కోసం ఏకంగా 1811 దరఖాస్తులిచ్చారు. వీటిలో ఏ పని జరగాలన్నా అ వ్యక్తి నంబర్‌కే ఎస్ఎంఎస్ వెళ్తుంది తప్ప.. అసలు వినియోగదారుడికి ఏ సమాచారం రాదు. ఎస్పీడీసీఎల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమకు కనెక్షన్ కావాలన్న ఆలోచనతో ఉన్న వినియోగదారులకు తమ నంబర్‌తో అక్కడ ఏ కనెక్షన్ లేదనే విషయం ఈరోజు వరకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అంటే దక్షిణ డిస్కం వినియోగదారుడికి ఎటువంటి సమాచారం చేరవేయాలన్నా అది అక్కడ ఇచ్చిన నెంబర్‌కే వెళ్తుంది తప్ప నేరుగా వినియోగదారుడికి వెళ్లడం లేదు. ఇదే తరహాలో మరొక వ్యక్తి 8309216677తో 870 దరఖాస్తులు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ విద్యుత్ సర్కిల్ పరిధిలోని అమన్‌గల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేసే ఓ విద్యుత్ ఉద్యోగి నంబర్ 94417 27326 తో టీకేపల్లి, అమన్‌గల్, మద్గుల్ గ్రామాల్లో 417 వ్యవసాయ కనెక్షన్ల కోసం డిస్కంకు దరఖాస్తు చేశారు. అసలు తనకు ఎందుకు ఎవరికోసం దరఖాస్తు చేశామో తెలియదని, తమ అధికారులు నంబర్ ఇచ్చి ఓటీపీ చెప్పమంటే చెప్పానని ఆయన అన్నారు. అంతేకాకుండా కొన్నిచోట్ల తన బంధువులకు సంబంధించిన వాటికి తన నంబర్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఉద్యోగి దరఖాస్తు చేసిన రైతులకు వాస్తవ రుసుం ఎంతనేది చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు వసూళ్లకు పాల్పడుతూ సొమ్ము అందిన తర్వాత కనెక్షన్లు ఇచ్చారని, ఇందులో సిబ్బంది పేరుతో స్థానిక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
నంబర్ తమదే ఇచ్చి
క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లతో కలిసి కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్లకు లోడు పెంపు వంటి పనుల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వచ్చిన కొత్త విధానాల నేపథ్యంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే ఒక విద్యుత్ కనెక్షన్ కోసం లోడ్‌ను బట్టి రేటును నిర్ణయించడం ద్వారా డిస్కం స్పష్టతతో ఉన్నప్పటికీ వినియోగదారులకు ఇంకా అవగాహన రాకపోవడంతో ఒక కనెక్షన్‌కు లోడ్‌ను బట్టి లక్ష రూపాయలు మొదలుకొని పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో సాధారణంగా ఒక విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట్లను కాంట్రాక్టర్లు చేస్తారు. దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసే క్రమంలో కొంత జిగ్‌జాగ్‌గా ఉండడంతో విద్యుత్ కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో హైరైజ్డ్ బిల్డింగులకు, పరిశ్రమలకు.. ఇతర భవనాలకు కనెక్షన్ కావాలంటే కాంట్రాక్టర్లు స్వయంగా యజమానులను సంప్రదించడమో లేక ఆ ప్రాంత విద్యుత్ అధికారి సూచన మేరకు యజమానులు కాంట్రాక్టర్లను సంప్రదించడమో సాధారణంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే డిస్కం అధికారులు ఒక నయాదందా చేస్తున్నారు. డిస్కం ద్వారా అంచనా ఎక్కువేసి కాంట్రాక్టర్లను కలవడానికి మార్గం సుగమం చేస్తే ఆ తర్వాత కాంట్రాక్టర్లు పూర్తి పనిచేసేవారు. తాజాగా ఈఆర్సీ తీసుకొచ్చిన నిబంధనల మేరకు లోడును బట్టి ఎస్టిమేషన్ ఫిక్స్ చేయడంతో ప్రస్తుతం ఎస్టిమేషన్ ఎక్కువేయడం లేకుండా నేరుగా కాంట్రాక్టర్లే రంగప్రవేశం చేసి ఐప్లె చేస్తున్నారు. ఈ దరఖాస్తులు చేసే క్రమంలో కొందరు విద్యుత్ సిబ్బంది వినియోగదారుల దరఖాస్తులను వారే నింపుతూ వినియోగదారుడి ఫోన్ నంబర్‌కు బదులు తమ ఫోన్నెంబర్లను ఇస్తూ డిస్కంకు పంపుతున్నారు. కనెక్షన్ మంజూరు, ఎంత రుసుం చెల్లించాలి, ఎప్పుడు మీటరు బిగిస్తారు.. ఇలా ప్రతీ విషయాన్ని ఆ నంబర్‌కే డిస్కం ఎస్ఎంఎస్లు పంపుతుంది. ఈ క్రమంలో డిస్కం నుంచి కొత్త కనెక్షన్‌కు కొంత మొత్తం చెల్లించాలని ఎస్ఎంఎస్ రాగానే అదనంగా డబ్బులు చెప్పి వసూలు చేస్తున్నారు. డిస్కం తీసుకొస్తున్న కొన్ని కఠిన నిబంధనలు కూడా కాంట్రాక్టర్లకు, సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. చాలామంది తమకు కొత్త మీటర్ కావాలని కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని తొందరపెడుతుండడంతో వసూళ్ల దందాకు ఇంకా బాగా కలిసి వస్తున్నది.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని పది సర్కిళ్లలో 67లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 59లక్షల డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో చాలావరకు ఎన్నో ఏళ్ల క్రితం తక్కువ లోడుతో తీసుకున్నవే కాగా ఆధునిక జీవనంలో గృహోపకరణాలు ఎక్కువగా రావడంతో వాటి వినియోగం వల్ల ఇంటికి వాడే కరెంట్ లోడు పెరుగుతోంది. గతంలో ఎప్పుడో 2,3 కిలోవాట్లతో కనెక్షన్లోడు తీసుకుని ఇప్పుడు 5 నుంచి 10 కిలోవాట్ల లోడును వినియోగిస్తున్నారు. ఇలాంటి ఇళ్లకు లోడు పెంపనకు దరఖాస్తు చేయాలని కాంట్రాక్టర్లు, సిబ్బంది తమ ఫోన్‌నెంబర్‌తో దరఖాస్తు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే కొన్నింటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడంతో వాటికి లోడు పెరగడం కష్టమని తాము ఏదో ఒకరకంగా మేనేజ్ చేస్తామంటూ కొందరు సిబ్బంది వినియోగదారులను నమ్మించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఏఈ నుంచి సీఈ వరకు పంపించాల్సి రావడంతో నెలలరోజుల సమయం పడుతోంది. దీంతో కనెక్షన్లు ఆలస్యమవడం, కరెంట్‌లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతుండడంతో కేటగిరీ మార్పు, ఇతర అంశాలపై త్వరితగతిన పనులు కావాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాలని, ఇందుకోసం సమాచారం నిమిత్తం తమ నెంబర్లనే వినియోగదారుల నంబర్ల స్థానంలో పెడతామంటూ చెప్పి మరీ తమ నెంబర్లతో కనెక్షన్లకు దరఖాస్తు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త వ్యవసాయ కనెక్షన్‌కు అయ్యే వ్యయంలో రూ.70వేలు మాత్రమే డిస్కం భరించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం కరెంటు లైను నుంచి కొత్త బోరు వద్దకు స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి వసూలు చేస్తున్నారు. నిజానికి చాలా కనెక్షన్లకు 70వేల లోపే ఖర్చవుతుందని రైతులు అదనంగా చెల్లించాల్సిన అవసరమే లేదని ఓ సీనియర్ ఇంజనీర్ చెప్పారు. ఇదిలా ఉంటే నగరశివార్లలో కొత్తగా అపార్ట్మెంట్లు లేదా విల్లాలు, హైరైజ్డ్ బిల్డింగులు కడుతుండడంతో విద్యుత్ కాంట్రాక్టర్లు, సిబ్బందికి కాసులు కురిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణానికి కరెంట్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు, మీటర్ల కేటాయింపు, పేరు మార్పు, కేటగిరీ మార్పు ఇలా ప్రతీ పనికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.