బేగంపేట: జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాలేరు వెంకటేశ్, వివేకానంద్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అరెస్టయిన కార్పొరేటర్లకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ కార్పొరేటర్లను బయటకు పంపి బడ్డెట్‌ను ఆమోదించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎలాంటి చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఏడాది దాటినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు.