Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ట్రేడింగ్ ప్రకటనను క్లిక్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 62 లక్షలు పొగొట్టుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్‌మెట్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి నెలలో ఫేస్బుక్లో ట్రేడింగ్ యాడ్ కనిపించింది. దానిని క్లిక్ చేసి పేరు, ఫోన్ నంబర్ లాంటి వివరాలు ఇచ్చాడు, దీంతో బాధితుడి ఫోన్ నంబర్‌ను ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గ్రూప్ డీ2 పేరుతో ఉన్నవాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.
అక్కడ ట్రేడింగ్ గూర్చి మెళకువలు చెప్పినట్లు నటిస్తూ రోజు 30 శాతం వరకు లాభాలొస్తాయంటూ సైబర్‌నేరగాళ్లు నమ్మించారు. ఆ తరువాత ఐసీఐసీఐఎంపీఆర్ఓ.కామ్ పేరుతో ఉన్న వెబ్సైట్ లింక్‌ను పంపించారు, అది క్లిక్ చేయగానే బాధితుడి ఫోన్ నెంబర్‌తో డీమాంట్ అకౌంట్ ఓపెన్ అయినట్లు మేసేజ్ వెళ్లింది. మొదట రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడంతో 2 వేలు లాభం కన్పించింది. ఇక అదంతా నిజమని నమ్మిన బాధితుడు ఆ తరువాత దఫ దఫాలుగా రూ. 11,61,300 పెట్టుబడి పెట్టాడు. స్కీన్ప్రై లాభాలు కన్పిస్తుండడంతో లాభాలు వస్తున్నాయని అనుకున్నాడు.
ఇంతలోనే ఐపీఓలు కొంటే మంచి లాభాలొస్తాయంటూ సైబర్‌నేరగాళ్లు నమ్మించారు, ఫలాన కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలని 50 శాతం డిస్కౌంట్ వస్తుందంటూ నమ్మించి రూ. 30 లక్షల షేర్లు కొనిచ్చారు.. అనంతరం మరో కంపెనీ ఐపీఓ షేర్లకు పెట్టుబడి పెట్టించారు. ఆ తరువాత పెట్టుబడికి డబ్బు లేకుంటే లోన్ ఇస్తారంటూ నమ్మించారు. అప్పటికే రూ. 62 లక్షల వరకు పలుమార్లు పెట్టుబడి పెట్టిన బాధితుడికి యాప్‌లో ఆయా షేర్ల విలువ కోటి రూపాయలకుపైగా కన్పిస్తోంది.
ఇక వాటిని విత్‌డ్రా చేసుకోవాలని బాధితుడు ప్రయత్నించాడు, అయితే మీరు రూ. 37 లక్షలు లోన్ తీసుకున్నారు వాటిని చెల్లించిన తరువాత మీకు ఆ ఖాతాలో ఉన్న డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుందంటూ సైబర్‌నేరగాళ్లు సూచించారు. దీంతో ఇదంతా అనుమానాస్పదంగా ఉందని భావించిన బాధితుడు సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అఫీస్‌కు వెళ్లి ఆరా తీయడంతో అదంతా ఫేక్ అని తేలింది. దీంతో తనను రూ. 62 లక్షలు చీటింగ్ చేశారంటూ బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మార్ఫింగ్ ఫొటోలతో వివాహితను..
హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువతికి గతంలో మెహిదీ పట్నానికి చెందిన అకుల్ సింగ్ అనే వ్యక్తితో పెండ్లి సంబంధం కుదిరింది. అయితే కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వారి పెండ్లి ఆగిపోయింది. దీంతో ఆమె మరొకరిని వివాహం చేసుకున్నది. ఈ నేపథ్యంలో అకుల్సింగ్ ఇన్‌స్టాలో ఓ నకిలీ ఐడీ తయారు చేసుకొని దాని ద్వారా వివాహితకు చెందిన మార్పింగ్ ఫొటోలు, ఆమె చెల్లెలికి చెందిన మార్ఫింగ్ ఫొటోలు .. తయారు చేస్తాడు. వాటిని సదరు వివాహితకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఈ క్రమంలో వివాహిత.. ఈ సమస్య పరిష్కారం కోసం అకుల్ సింగ్‌ను సంప్రదించి.. సదరు ఐడీ ద్వారా తనకు జరిగిన అన్యాయంపై వివరిస్తుంది. దీన్ని పరిష్కరిస్తానని వివాహితకు హామీ ఇచ్చిన అకుల్ సింగ్… తాను సృష్టించిన ఫైక్ ఐడీకే 6 లక్షల రూపాయలు పంపినట్టుగా చాట్ చేస్తాడు. ఆ స్కీన్ షాట్లను ఓ సాక్ష్యంగా వివాహితకు పంపి.. సమస్య పరిష్కారమైనట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. తనకు 6 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిందిగా ఆమెకు చెబుతాడు. అయినప్పటికీ ఫేక్ ఐడీ నుంచి మార్ఫింగ్ ఫొటోలు ఆగకపోవడంతో అనుమానం పెరిగిన వివాహిత తన భర్త ద్వారా సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు విచారణ జరిపి అకుల్సింగ్ను అరెస్టు చేశారు.
డిజిటల్ అరెస్టు చేసిన వ్యక్తి అరెస్టు
నగరానికి చెందిన 72ఏళ్ల వ్యక్తికి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నామంటూ..ఓ కాల్ వచ్చింది. సదరు వ్యక్తి పేరు మీద ముంబై నుంచి ఇరాన్‌కు ఫెడెక్స్ ఇంటర్నేషనల్ సర్వీస్‌కు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పారు. ఈ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని దీని తక్షణ విచారణ నిమిత్తం ముంబై క్రైమ్ పోలీసులు, నార్కొటిక్ విభాగం వారితో ఫోన్ కాల్ కనెక్ట్ చేస్తున్నామని తెలిపారు.
సదరు వ్యక్తికి అనేక రాష్ర్టాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని చెబుతూ హైదరాబాద్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పడంతో.. బాధితుడు మాట్లాడుతున్నవాళ్లు పోలీసులేనని నమ్మక తప్పలేదు. ఇలా భయపెట్టి సైబర్ నేరగాళ్లు 19.6 లక్షలు తమ అకౌంట్లలోకి జమ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు యూపీ లోని గజియాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.