సిటీబ్యూరో, డిసెంబరు 19 (నమస్తే తెలంగాణ): సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… నగరంలోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ముఖేష్ బాబు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ వినియోగిస్తూ చివరకు దానినే వ్యాపారంగా మార్చుకుని, కొనుగోలు చేసిన దాంట్లో తనకు కావల్సినంత వాడుకుని, మిగిలిన డ్రగ్స్‌ను ఇతరులకు విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పటాన్చెరువు ప్రాంతంలోని బీరంగూడ శ్రీవిద్య నర్సరీ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్ఐ జ్యోతి తన సిబ్బందితో కలిసి నిందితుడిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 0.42 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీన్పూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
బేగంపేటలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా అక్కడ జోరుగా గంజాయి చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య తన సిబ్బందితో బేగంపేట, దాని పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. శుక్రవారం మనోజ్‌కుమార్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తుండగా అప్పటికే అక్కడ నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 220గ్రాముల మత్తు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
ఒరిస్సా ప్రాంతం నుంచి రైళ్లలో గంజాయి వస్తుందని సమాచారంతో ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు బృందం పలు రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో గంజాయి బయటపడింది. పోలీసుల రాకను దూరం నుంచి గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలో లభించిన 20కిలోల గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో హెరాయిన్ డ్రగ్స్ విక్రయిస్తున్న దినేష్ లోదా అనే వ్యక్తిని సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10.5గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన దినేష్ ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. వృత్తిపరంగా గుజరాతీల ఇళ్లలో వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజస్థాన్ నుంచి హెరాయిన్‌ను తక్కువ ధరకు దిగుమతి చేసుకుని, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్మ చేసుకుంటున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10.5గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.