హైదరాబాద్: హైదరాబాద్‌లోని భోలక్‌పూర్ కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకున్నది. భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కారణంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి (Software Employee) ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు 12 ఏళ్ల క్రితం మరణించాడు. చిన్న కుమారుడు విశాల్‌గౌడ్ (28) టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్లో మల్లాపూర్‌కు చెందిన నవ్య(25) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి.. ఒక్కటైనా కూడా మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఈ ఏడాది మార్చిలో తల్లిగారి ఇంటికి వెళ్లిన నవ్య తిరిగి రాలేదు.
కాగా, రెండు నెలల క్రితం విశాల్‌పై నవ్య ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల నుంచి ఫోన్ రావడంతో విశాల్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. అనంతరం కేసు నమోదు కావడంతో స్టేషన్‌కు రమ్మని మరోసారి ఉప్పల్ పోలీసులు ఫోన్ చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తలుపు తీయకపోవడంతో ఇంట్లో వారికి అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు గాంధీకి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కోడలు నవ్య, అత్తమామల వేధింపులతోనే విశాల్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. గాంధీనగర్ పోలీసులు విచారణ జరిపి విశాల్‌గౌడ్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.