Smart Parking | సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు) వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్‌లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ సమస్య జఠిలంగా ఉన్నది. దీంతో పార్కింగ్ సమస్యకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేబీఆర్ పార్కు గేట్-1 వద్ద కడక్ చాయ్ సమీపంలో స్మార్ట్ మల్టీలెవల్ (మెకనైజ్డ్) కార్, మోటరు సైకిల్ పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆసక్తి గల ఏజెన్సీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు టెండర్లను ఆహ్వానించారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడ్‌లో పైలట్ ప్రాజెక్టుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. 405 చదరపు మీటర్లలో మల్టీలెవల్ కారు పార్కింగ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
72 కార్ల పార్కింగ్‌కు స్థలాన్ని కలిగి ఉంటుంది. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. టెండర్ ప్రక్రియలో భాగంగా నవనిర్మాణ్ అసోసియేట్స్, మేఘా ఫ్యాబ్రికేట్స్ రెండు ఏజెన్సీలు అర్హత సాధించాయి. రూ. 28.23 లక్షలు కోడ్ చేసిన నవ నిర్మాణ్ అసోసియేట్స్‌కు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే నేడు మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ టెండర్ ప్రక్రియకు ఆమోదం తెలుపనున్నారు.