వెంగళరావునగర్, మే 26: రహదారిపై గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనపై గుత్తేదారుతో సహా ముగ్గురిపై నిర్లక్ష్యం, బాలకార్మిక చట్టం కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు దంపతులు జి.సుధాకర్, సునీత జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అడ్డగుట్ట తుకారాంగేట్ సమీపంలో ఉంటున్నారు. వీరికి పూజిత(19), శివకుమార్(16) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్వగ్రామంలో ఎల్లమ్మ పూజ ఉండటంతో భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. ఇంట్లో కుమారుడు శివకుమార్ ఉండగా.. దగ్గరి బంధువైన శ్రీను శనివారం రాత్రి అమీర్‌పేట మైత్రీవనం వద్ద హెచ్ఎండీఏ కొనసాగిస్తున్న పునరుద్ధరణ పనుల కోసం తీసుకువచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో మైత్రీవనం ఆవరణలో మొక్కలు నాటడం కోసం గుత్తేదారు మహబూబ్ పాషా, సూపర్వైజర్ ఖదీర్ పాషా ట్రాక్టర్‌తో తవ్వకపు పనులను బాలుడు శివకుమార్‌తో చేయిస్తున్నారు.
తవ్వుతుండగా భూమిలో ఉన్న విద్యుత్ తీగ తగలడంతో శివకుమార్ విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో అక్కడే పడిపోయాడు. వెంటనే బాలుడిని సమీపంలోని దవాఖాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కుమారుడి మృతి పట్ల ఆందోళనకు దిగారు. తల్లి సునీత ఫిర్యాదు మేరకు బాలుడిని పనిలోకి పెట్టుకున్న బంధువు శ్రీనుతో పాటు గుత్తేదారు మహబూబ్ పాషా, సూపర్వైజర్ ఖదీర్ పాషాపై వివిధ సెక్షన్లతో పాటు బాలకార్మిక చట్టం, జేజే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.