చర్లపల్లి, సెప్టెంబర్ 20 ః నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మోత్కూర్ మండలం అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్‌తో మంజుల(33)కు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురూ కొద్ది కాలం క్రితం బతుకుదెరువు కోసం ముంబాయికి వలస వెళ్లారు.
వివాహమైన నాటి నుంచి సంసారం సాఫీగా సాగినా, కొద్ది కాలంగా మంజులపై అనుమానంతో శంకర్ దూషించడం మొదలు పెట్టాడు. వేధింపులు భరించలేక వారం రోజుల క్రితం కాప్రా సర్కిల్ అణుపురంలో నివాసముండే ఆమె అక్క రాణి ఇంటికి వచ్చి ఉంటుది. ఈ నెల 19వ తేదిన శంకర్ ముంబాయి నుంచి అణుపురం రావడంతో మంజుల అన్న ఇంట్లోనే ఈ విషయంపై శంకర్‌తో చర్చించారు. దీంతో ఇక మీదట మంజులను ఇబ్బందులకు గురిచేయనని శంకర్ హామీ ఇచ్చాడు.
అనంతరం రాత్రి అందరూ నిద్రకు ఉపక్రమించారు. మంజుల నిద్రపోయిన తర్వాత శంకర్ పదునైన కత్తితో మంజుల మెడపై తీవ్రంగా గాయపరచి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలకు గురైన మంజుల తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.