సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): ప్రధాన జంక్షన్ల వద్ద మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కీలకమైన ప్రణాళికలను హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ, బాటసారుల సంరక్షణ, ప్రమాద రహిత జంక్షన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్కై వాక్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తోంది. ముఖ్యంగా, ఆర్టీసీ బస్టాండ్లు, మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లను కలుపుతూ నిర్మించాల్సిన స్కై వాక్‌ల నిర్మాణం కొలిక్కి తీసుకురావడంలో హెచ్ఎండీఏ హుమ్టా ప్రతిపాదనలు కార్యరూపంలోకి రావడం లేదు. దీంతో ప్రాజెక్టుల ప్రతిపాదనలన్నీ కూడా హెచ్ఎండీఏ గడప దాటి బయటకు రావడం లేదు.
నగరంలో కొత్తగా స్కైవాక్‌ల నిర్మాణం చేయాలనే ప్రతిపాదన సుదీర్ఘకాలంగా హెచ్ఎండీఏలో మూలుగుతోంది. అత్యంత రద్దీగా ఉండే కూడళ్ల వద్ద ఎలివేటెడ్ స్కై వాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఆచరణలోకి రావడం లేదు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలతోపాటు, బేగంపేట ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌ను అనుసంధానం చేస్తూ భారీ స్కై వాక్ వేల నిర్మాణానికి గతంలోనే సూత్రప్రాయంగా ఆమోదించారు. ఈ క్రమంలో హుమ్టా పలు ప్రాంతాలను కూడా అధ్యయనం చేసింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కార్యరూపంలోకి రాలేదు.
గడప దాటని ప్రణాళికలు
ఇక నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భారీ స్కై వాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుబాటులో మెట్రో, రైల్వే, బస్ స్టేషన్లను కలుపుతూ… భారీ స్కై వాక్ నిర్మించేందుకు రైల్వే, హెచ్ఎండీఏ-ఉమ్టా ప్రణాళికలు రూపొందించారు. ఇందులోనూ భూ సేకరణ తలనొప్పి లేకుండా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా కాగితాలకే పరిమితం కాగా, ఇదే తరహాలో నగరంలోని బేగంపేట్ రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే స్టేషన్ అనుసంధానం చేస్తూ కూడా స్కై వాక్ వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు విషయంలో ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీంతోపాటు నగరవ్యాప్తంగా లక్డీకాపూల్ పెట్రోల్ బంక్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్ వేల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కేవలం ఉప్పల్ వాక్ వే మినహా ఏ ఒక్క అందుబాటులోకి రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియమించారు. కానీ ఏ ఒక్క ప్రణాళిక కూడా కార్యరూపంలోకి రాలేదు.
అసంపూర్తిగానే మెహదీపట్నం స్కైవాక్
రక్షణ శాఖ నుంచి భూ వివాదాలు తొలగని మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిత్యం రద్దీగానే మెహదీపట్నం జంక్షన్ సిగ్నల్ ఫ్రీగా మారుతుంది. ముఖ్యంగా బాటసారులకు ఎంతో ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ నిర్మాణ పనుల విషయంలో హెచ్ఎండీఏ దృష్టి పెట్టకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదు.