మలక్‌పేట, ఏప్రిల్ 23:తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించుకుని మూసారాంబాగ్ డివిజన్ సలీంనగర్లో అక్రమంగా నివాసముంటున్న ఇద్దరు బంగ్లా దేశీయులను, వారికి సహకరించిన మరో నలుగురిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మలక్‌పేట పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించుకుని మూసారాంబాగ్ డివిజన్లోని సలీంనగర్లో ఇద్దరు బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసముంటున్నారన్న విషయం తెలుసుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మలక్‌పేట పోలీసులతో కలిసి మంగళవారం సలీంనగర్‌లోని ఇంటిపై దాడులు చేసి ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్ మీర్పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హసిబుల్(23)జోవాన్ చౌదరి పేరుతో, బంగ్లాదేశ్ జెస్సోర్ జిల్లా బెనాపోల్ గ్రామానికి చెందిన రోహన్ సాహ(21) అలియాస్ రోహన్ పేర్లతో దేశంలోకి అక్రమంగా చొరబడి మూసారాంబాగ్ డివిజన్లోని సలీంనగర్లో నివాసం ఉంటున్నారు. బంగ్లాదేశ్‌లోనే తప్పుడు ఆధార్ కార్డులను సృష్టించుకున్న వీరు, ఇక్కడకు వచ్చిన తర్వాత నల్గొండ చౌరస్తాలోని స్మోక్ అండ్ పాన్ షాప్ నిర్వాహకుడు, అక్బర్ బాగ్‌కు చెందిన మహ్మద్ ముఖిద్(39)ను కలిశారు.
తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పించాలని కోరారు. దాంతో అతడు కాలాడేరా ప్రాంతానికి చెందిన డీఆర్పీ ఆపరేటర్ తేమూర సాయికిరణ్(50)కు విషయాన్ని చెప్పగా అతడు, చంచల్‌గూడ డైమండ్ హోటల్ ప్రాంతానికి చెందిన బ్రోకర్(ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించే బ్రోకర్) గడ్డమీద రజినీకాంత్(46), నార్సింగ్ మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుడ్డు సుధీర్ కుమార్(27)సాయంతో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించుకొని ఏడాదిన్నర కాలంగా అక్రమంగా నివాసం ఉంటూ లేబర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
దాంతో మంగళవారం ఉదయం మలక్‌పేట పోలీసుల సాయంతో దాడులు నిర్వహించిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీయులతోపాటు వారికి తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఇచ్చిన మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, ఒక సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.