అబిడ్స్, సుల్తాన్‌బజార్, తెలుగు యూనివర్శిటీ, మార్చి 27: నగరంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.
వేలాది మంది భక్తులతో ప్రారంభమైన శోభాయాత్ర..జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, కోల్సావాడి, సిద్దంబర్బజార్ల మీదుగా సాగింది. యాత్ర మార్గమంతా భక్తుల శ్రీరామనామస్మరణతో మార్మోగింది. కాగా, శోభాయాత్ర ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సందర్శించారు. గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ జి చంద్రమోహన్ పర్యవేక్షణలో వివిధ డీసీపీలు, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి, గోషామహల్ ఏసీపీ సుదర్శన్‌ల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.