జూబ్లీహిల్స్, జూలై 19: ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లో మందకొడిగా సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా గ్రేటర్ ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు రావుల శ్రీధర్‌రెడ్డి విన్నూతంగా ‘సర్ అవేర్నెస్ ఆన్ వీల్స్..’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు గడువు పొడిగించిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఒక్కరూ గడువుకు వారం ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసుకునేందుకు ఈ రెండు ప్రచార రథాలు విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు వారు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇప్పటికే అన్ని డివిజన్లలో హెల్ప్ డెస్క్ సేవలు అందిస్తున్నాయని.. ఈ ప్రచార రథాలతో ఓటర్లలో చైతన్యం కల్పిస్తూ పదిహేను రోజులపాటు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు ఏ ఒక్కరూ దూరం కావద్దని.. అర్హులైన ప్రతి ఓటరును స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో నమోదు చేయాలన్నారు. ఇందుకుగానూ ప్రచార రథాలు ఓటర్లలో చైతన్యం కల్పిస్తూ బీఆర్ఎస్ బీఎల్ఏలను సమన్వయం చేస్తూ ఓటరు నమోదును వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ వాహనాలు నియోజకవర్గంలోని ప్రతి బస్తీకి వెళ్లి ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు అపోహలను తొలగించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.