హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రైతుభరోసా ఇవ్వాలని అడిగితే ఖజానాలో డబ్బుల్లేంటూ సమాధానమిస్తున్న ప్ర భుత్వం, ఓ కాంట్రాక్టర్‌కు మాత్రం పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నదని, చిన్న కాంట్రాక్టర్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. క్యూర్ బిల్లుపై అసెంబ్లీలో శనివారం కొనసాగిన చర్చలో అక్బరుద్దీన్ పా ల్గొని సమస్యలను ప్రస్తావించారు.
దశాబ్దాలుగా చార్మినార్ సుందరీకరణ అని చెప్పడమే తప్ప, చేసిందేమీ లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు తీసుకువచ్చారని, కానీ ఆటో డ్రైవర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఓ లక్కీ కం పెనీకే హైదరాబాద్‌లో రూ.1,400 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్‌ను అప్పగించిందని, అన్ని కాంట్రాక్టులూ ఆ కంపెనీకి కట్టబెట్టడడమే కాకుండా, వెంటవెంటనే బిల్లులు కూడా చెల్లిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సదరు కంపెనీకి ఇప్పటివరకు ఎన్ని బిల్లులు విడుదల చేశారో చెప్పాలని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ విభజనకు కారణం చెప్పాలి
జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు కారణం ఏంటో చెప్పాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. అసలు ఈ విషయాన్ని బిల్లులో ఎక్కడా పేర్కొనలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉన్నది.. వేతనాలు సరిపోవట్లేదు అంటున్న ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులను ఎలా తెస్తారు? అని నిలదీశారు. ఆ బిల్లులో అనేక లోపాలున్నాయని, మేయర్, కార్పొరేటర్లు నామమాత్రంగా ఉంటారన్నారు.