లక్నో/పాట్నా: భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో గంగా నది పొంగిపొర్లుతున్నది. భాగల్పూర్లో జాతీయ రహదారి 80 నీట మునిగింది. ఇదే ప్రాంతంలో ఐదుగురు మృతి చెందారు. యూపీలోని మొరాదాబాద్ వరదలకు అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. గెగాసో ఘాట్ నీట మునిగింది. దీంతో ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నారు.వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ పీఆర్ఓ సందీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ డ్రైనేజీ లైన్లు 1,300 కి.మీ.. విస్తరించి ఉన్నాయనన్నారు. వీటిలో నీరు నిలవట్లేదని లిపారు.
వరద నీటితో పోటెత్తుతున్న నదిని తాళ్లతో కట్టిన ఒక ఇనుప బల్లకట్టుపై పాఠశాల విద్యార్థులు దాటుతున్న ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. ముహానే నదికి వరదలు రావడంతో స్కూల్కు వెళ్లేందుకు ప్రమాదకరంగా విద్యార్థులు ఆ బల్లకట్టుపై వెళ్లారు. పెద్దవారెవ్వరూ కూడా లేకున్నా దానిపై నిలబడి ప్రయాణిస్తుండటం ఒళ్లు గగుర్పొడుస్తున్నది.
బర్హ్ జిల్లా ఏక్దంగా పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు చదువుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నదికి అవతల ఒడ్డున ఉండటంతో వారు నదిని దాటుతున్నారు. పిల్లలను అలా బల్లకట్టుపై నదిని దాటించడం ప్రమాదమని, కనీసం పెద్దలైనా వారితో ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పామని పాఠశాల ఇన్చార్జి టీచర్ ఆదర్శ్ అనికేత్ తెలిపారు. కానీ చాలామంది దినసరి కూలీలు కావడంతో వారు తమ పిల్లల వెంట రావడం లేదన్నారు.