సిటీబ్యూరో/ఖైరతాబాద్/హిమాయత్‌నగర్, జూన్ 18 ( నమస్తే తెలంగాణ ) : “మోదీ దిగిపో..తప్పుని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థుల ఉసురుతగులుతది. ఎవరి ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు? మీ స్వార్థం..మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకుంటారా? ఈ లీకేజీ వెనక ఉన్నది ఎవ్వరు? దేశ వ్యాప్తంగా నీట్ అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే ప్రధాని మౌనంగా ఉండటం సిగ్గుచేటు. ప్రతి విద్యార్థి కన్నీటి చుక్కకు కేంద్రం సమాధానం చెప్పాలి. నీట్ పరీక్షను రద్దు చేయాలి. లేకపోతే దేశ వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మౌనంగా ఉండటం కూడా మోదీ మెప్పు పొందడానికేనా? ఇక్కడి బిడ్డలకు అన్యాయం జరిగితే స్పందించరా? స్పందించకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్డడిస్తాం.” అంటూ సుమారు 12 విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ,పీడీఎస్ యూ, ఎన్ ఎస్‌యూఐ, విద్యార్థి జనసమితి, డీవైఎఫ్ఐ, పీవైఎల్,ఆమ్ ఆద్మీపార్టీ విద్యార్థి విభాగాల నాయకులు నీట్ అవకతవకలపై విరుచుకుపడ్డారు. పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డిలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలంటూ నినదించారు. విద్యార్థులు నీట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ గొంతెత్తారు. నారాయణ గూడ నుంచి లిబర్టీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. పీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అవకతవకలపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్వీ ఆధ్యర్వంలో రాజ్‌భవన్ ముట్టడి యత్నం జరిగింది. మెరుపు ముట్టడితో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్‌భవన్ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 8,850 సీట్లు ఉన్నాయని, 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో 9,500 సీట్లు ఉన్నాయని, తద్వారా ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశానికే పోతున్నాయన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల్లో ఇక్కడి నుంచి వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడం విచారకరమన్నారు. ఒక్క ఎంబీబీఎస్ మాత్రమే కాదని, ఆయూష్, వెటర్నరీ, బీడీఎస్ తదితర విభాగాల్లోనూ తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. నీట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ముందుగా రద్దు చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేశారని, జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల కావాల్సినంత సీట్లు స్వరాష్ట్ర విద్యార్థులకు లభించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష చూపుతుందని, 150 వైద్య కళాశాలలు కేటాయించగా, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడంతోనే వివక్ష వెలుగుచూసిందన్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నీట్‌ను వ్యతిరేకించిందని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదని, వెంటనే కేబినేట్ తీర్మాణం చేసి నీట్ నుంచి తెలంగాణను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం స్పందించకుంటే ఆయన కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామన్నారు. బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, నితీశ్, లోకేశ్, శ్యామ్, రాహు ల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.