బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 1: సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్‌ను రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ యాదవ్, సోషల్ జస్టిస్ పార్టీ ఇన్చార్జి కె.వెంకట్ గౌడ్, బీసీ ఆజాద్ సంఘ్ అధ్యక్షుడు డి.మహేశ్ గౌడ్, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి, బీసీ నాయకుడు రవి యాదవ్, అఖిల పక్ష నాయకులు ఆదివారం పరామర్శించి, తమ సంఘీభావం తెలిపారు.
అనంతరం, వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం కోటా ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ, బీసీ నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నదని, తాము ప్రభుత్వంతో మాట్లాడతామని, దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు దీక్ష విరమించేది లేదని సిద్దేశ్వర్ పటేల్ అన్నారు.
మరో నాయకుడు, బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ నేత ఆరోగ్యం క్షీణించింది. శనివారం సాయంత్రం నుంచి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, చేతికి ఇన్ఫెక్షన్ సోకడం, షుగర్, క్రియాటిన్ లెవెల్ బాగా తగ్గడంతో గాంధీ దవాఖానలో వైద్యులకు చెప్పినా, సరిగ్గా స్పందించడం లేదని ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన శనివారం రాత్రి సంజయ్‌ను కాచిగూడలోని ప్రతిమా ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సంజయ్ సోదరుడు అభిలాష్ తెలిపారు.