మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ)10: 13 లక్షలు దండుకొని బాధితులకు చివరికి శవాన్ని అప్పజెప్పిన సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ను రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు కొత్త రోగులను ఎవరినీ చేర్చుకోవద్దని ఆదేశించారు. 13 లక్షలు బిల్లు వసూలు చేసి చివరికి శవాన్ని అప్పగించడంపై, రెండు రోజులుగా కేవలం మృతదేహానికే చికిత్స చేశారన్న రోగి బంధువుల ఆరోపణలపై డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ పూర్ణిమ, సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు.
మదీనగూడ లోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ ను జిల్లా వైద్య బృందం పరిశీలించి దవాఖాన యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. రోగులు ఎప్పుడు హాస్పిటల్లో చేరారు? ఎలాంటి చికిత్స అందించారు? ఎంత బిల్లు ఖర్చైంది? ఆమె ఎప్పుడు చనిపోయింది? వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా తాము అడిగిన ప్రశ్నలకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో వారిపై డీఎంహెచ్ఓ మండిపడ్డారు.
చికిత్సకు సంబంధించిన కేస్ షీట్స్ తీసుకొని ఆధారాలు సేకరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషంట్ చనిపోవడానికి కారణమైనట్లు నిర్ధారణ అయితే దాకాన యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దవాఖానాలో 28 మంది రోగులు ఉన్నారని, విచారణ పూర్తయ్యే వరకు కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశించినట్టు తెలిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో లోతుగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.