బంజారాహిల్స్, సెప్టెంబర్ 10: జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఇండ్లను కూలగొడుతూ పేదల ఉసురు తీస్తోందన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బుచ్చమ్మ అనే మహిళ ఇంటిని కూల్చేస్తామంటూ హైడ్రా అధికారులు నోటీసులు అంటిస్తే ఆమె గుండె ఆగి చనిపోయిందని గుర్తు చేశారు. బోరబండలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ ఇంటిని స్థానిక నేతల ఒత్తిడితో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తే తట్టుకోలేక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. డబ్బున్న పెద్దవారి జోలికి వెళ్లని హైడ్రా.. పేదలు నివాసం ఉంటున్న బస్తీలకు, కాలనీల్లోకి వచ్చి ఇండ్లను కూల్చేస్తోందని, చెరువులో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కట్టిన ఇంటిని కూల్చేసే దమ్ము హైడ్రాకు ఉందా అంటూ ప్రశ్నించారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ మాత్రం పొరపాటు చేసినా మూడేండ్ల పాటు గోసపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
నిరంతరం ప్రజల కోసమే..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమన్నారు. మాగంటి గోపీనాథ్ ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించేవారని, ప్రజలకు బహుమతులు ఇవ్వడం… పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుండేవారని.. అయితే మాగంటి గోపీనాథ్ తన కష్టాలు ఏనాడూ బయటకు చెప్పేవారు కాదన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేని విషయాన్ని కూడా చెప్పలేదని, అనుకోకుండా ఏఐజీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన ఉంటున్న ఇంటిని చూస్తే చాలా బాధవేసిందని, నిరంతరం ప్రజల కోసమే పనిచేసిన మాగంటి ఇల్లు చిన్నదని, ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాల్సి ఉందని, కొడుకు చిన్నవాడని రాజకీయాల్లో ఉండి పెద్దగా సంపాదించుకున్నదేమీ లేదని మాగంటి చనిపోయిన తర్వాత అర్ధమైందన్నారు. కష్టాల్లో ప్రజలకు అండగా ఉన్న మాగంటి గోపీనాథ్ కుటుంబానికి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలన్నారు.
సర్వేలో బీఆర్ఎస్కు ఆధిక్యత..
తాజాగా నిర్వహించిన అన్ని సర్వేల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఉందన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో బస్తీల వారీగా నిర్వహించిన సర్వేల ఫలితాలను కేటీఆర్ కార్యకర్తలకు వివరించారు. పార్టీకి బలం ఉన్న ప్రాంతాలతో పాటు తక్కువ బలం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత ఎక్కువ ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో అనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
ఓటర్ జాబితాలో పేర్లు లేనివారిని వెంటనే చేర్చాలని సూచించారు. బోగస్ ఓట్లను గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్‌నగర్ డివిజన్ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాగంటి సునీతా గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు పి.విష్ణువర్ధన్‌రెడ్డి, వినయ్ భాస్కర్, కార్పొరేటర్ దేదీప్యరావు, మైనార్టీ నేత సొహైల్ తదితరులు పాల్గొన్నారు.