(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): జీఎస్టీలో (వస్తు, సేవల పన్ను) తీసుకొచ్చిన తాజా సవరణలు బీమా పాలసీదారులకు ఏ మాత్రం ఊరట కలిగించేలా లేవన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం.. గ్రూప్ బీమా పాలసీలపై మాత్రం ట్యాక్సును 18 శాతంగానే కొనసాగించడం ఆందోళన కలుగజేస్తున్నది. అంతేకాదు, వ్యక్తిగత బీమా పాలసీదారులకు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో మరో భారం పడుతున్నట్టు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.
భారం తగ్గలేదుదేశంలో బీమా పాలసీలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత బీమా పాలసీ కాగా, రెండోది గ్రూప్ బీమా పాలసీ. వ్యక్తిగత బీమా పాలసీలను అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు తీసుకొంటుండగా, గ్రూప్ బీమా పాలసీలు ఉద్యోగుల తరుఫున కంపెనీలు తీసుకొంటాయి. ఆ మేరకు ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో వసూలు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. కాగా, వ్యక్తిగత పాలసీలపై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం.. గ్రూప్ బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని యథాతథంగానే కొనసాగించింది. దీంతో జీఎస్టీ 2.0తో తమపై ప్రీమియం భారం ఏ మాత్రం తగ్గలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మేరకు ది యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఆరోగ్య, జీవిత గ్రూప్ బీమా పాలసీల మీద కూడా జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ భారంతో వచ్చే అరకోర వేతనాల్లో తాము అధిక భాగాన్ని కోల్పోతున్నట్టు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత పాలసీలకూ భారమే!
వ్యక్తిగత బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేసినట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరిట పాలసీదారులకు కొంతమేర భారం పడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జీఎస్టీ ఎత్తివేతతో ఐటీసీ క్లెయిములకు ఆస్కారమే లేకుండా పోతున్నదని, దీంతో తమ వ్యాపార కార్యకలాపాలకు చేసే చెల్లింపుల భారం ఇకపై కంపెనీలపైనే పడబోతున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ భారాన్ని పాలసీదారులపైనే కంపెనీలు వేసే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. ఇదే జరిగితే పాలసీల బేస్ ప్రీమియం ధరలు 3 నుంచి 5 శాతం పెరగవచ్చని అంటున్నారు. కాబట్టి పాలసీదారులు చెల్లించే మొత్తాలు తగ్గినా.. ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేత పూర్తి ప్రయోజనం మాత్రం అందకపోవచ్చనే పేర్కొంటున్నారు. మొత్తంగా జీఎస్టీ తాజా సవరణలతో అటు గ్రూప్ బీమా పాలసీదారులకు, ఇటు వ్యక్తిగత బీమా పాలసీదారులకు ఊరట దక్కింది కొంతేనని చెప్తున్నారు.
గ్రూప్ ప్రీమియం భారం ఇలా..