అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నది. కారు గర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి.
గణేశ్ నిమజ్జనానికి ట్యాంకుబండ్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారనడానికి అదే నిదర్శనం. అదే సమయంలో కేసీఆర్‌కు మద్దతుగా ‘కారు గుర్తుకు ఓటేస్తా.. చల్ దేక్లేంగే..’ పాట ట్యాంకుబండ్‌పై మార్మోగడంతో మళ్లీ కేసీఆర్ రావడం పక్కా అని తేలిపోయింది. -కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నదని, బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేస్తే తమ ఇండ్లను కూల్చివేయడానికి అనుమతి ఇచ్చినట్టేనని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజలకు ఒకమంచి పని కూడా చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొకుతున్నారని మండిపడ్డారు. బుధవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం చేపట్టి అహంకారంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామంటూ ప్రజలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆపదలో ఉన్నప్పుడు గోపీనాథ్ కుటుంబం నియోజకవర్గ ప్రజలను ఆదుకున్నదని, ఇప్పుడు ఆపదలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అని, ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్న విషయాన్ని ముస్లిం మైనార్టీలు గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ సర్కారులో ఒక్క ముస్లిం మైనార్టీ అయినా మంత్రిగా ఉన్నరా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎంపికచేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.
ఇందిరమ్మ రాజ్యమంటే కూల్చడమేనా?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరలేదన్న అకసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హైడ్రా తన ఇంటిని కూలగొడుతుందన్న భయంతో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకున్నదని గుర్తుచేశారు. డబ్బున్న పెద్దల జోలికి మాత్రం హైడ్రా పోవడం లేదని విమర్శించారు. దుర్గంచెరువులో ఎఫ్టీఎల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉన్నదా? అని ప్రశ్నించారు. అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని విమర్శించారు. కారు గర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, తమ అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్
ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శనంలో బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నడుస్తున్నారనే విషయాన్ని మైనార్టీలు గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ, మోదీ, సీబీఐ లాంటి అంశాల్లో కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ఓటేస్తే మోదీకి, బీజేపీకి వేసినట్టేనని హెచ్చరించారు. గడిచిన పదేండ్ల్లలో మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పకనపెట్టిందని విమర్శించారు. చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని చెప్పారు. ఇప్పటివరకు ఒక మైనార్టీ విద్యార్థికి కూడా సాలర్షిప్ అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.4,000 కోట్ల మైనార్టీ బడ్జెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కానీ పదేండ్లలో మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టిందని తెలిపారు. 60 ఏండ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ వాడుకున్నదని కేటీఆర్ మండిపడ్డారు.
క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ గోపీనాథ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ క్లాస్‌గా కనిపించే మాస్‌లీడర్ అని కేటీఆర్ అభివర్ణించారు. సొంత ఖర్చుతో అనేక పెద్దపెద్ద కార్యక్రమాలు నిర్వహించేవారని, ప్రతి బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పట్టుబట్టలు పెట్టేవారని గుర్తుచేశారు. తన ఇబ్బందులను గోపీనాథ్ ఎన్నడూ తమతో పంచుకోలేదని అన్నారు. తన అనారోగ్య సమస్యను కూడా ఎప్పుడూ ఎవరి వద్ద ప్రస్తావించకుండా ఉంచారని తెలిపారు. రాజకీయ నాయకుల జీవితాలు బయటికి కనిపించేలా ఉండవన్న సంగతి గోపీనాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థం అవుతుందని తెలిపారు. ఎవరూ ఊహించని ఉప ఎన్నిక ఇదని, గోపీనాథ్ హఠాత్తుగా దూరమవుతారని అనుకోలేదని అన్నారు. 200 గజాల చిన్న ఇంట్లోనే ఆయన నివసించేవారని, ఆయన ఇద్దరు బిడ్డలు కూడా ఇంకా సెటిల్ కాలేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఏ ఒకరికి కష్టమొచ్చినా నేను ఉన్నానంటూ ముందుకొచ్చి ఆదుకొనేవారని తెలిపారు. నియోజకవర్గంలో ఒకచోట ఐదెకరాల ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారని గుర్తుచేశారు. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
50 వేల మెజార్టీ తగ్గొద్దు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు పలు సర్వేలు స్పష్టంచేస్తున్నాయని, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్ మెజార్టీ కోసం కృషిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 50 వేల మెజార్టీకి ఏమాత్రం తగ్గొద్దని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారని చెప్పారు. అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైతం బీఆర్ఎస్ను గెలిపించుకుని, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్లి, గోపీనాథ్ చేసిన పనులు, సేవలను ఓటర్లకు గుర్తుచేయాలని సూచించారు. బీఆర్ఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. యుద్ధంలా పోరాడితేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాసర్, పీ విష్ణువర్ధన్‌రెడ్డి, కోరుకంటి చందర్, రహమత్‌నగర్ ఇన్చార్జి తకళ్లపల్లి రవీందర్రావు, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతతోపాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
22 నెలలైనా పింఛన్ పెంచలేదు
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 22 నెలలైనా ఇంకా పెన్షన్లు పెంచలేదని, అత్తా కోడళ్ల మధ్య చిచ్చుపెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు ఎగ్గొట్టారని, ఆడబిడ్డలకు నెలనెలా రూ.2,500 ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు అబద్ధపు హామీల ప్రభావానికి గురై మోసపోయిన ప్రజలు ఆ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తున్నారని చెప్పారు.
రాహుల్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ, మోదీ, సీబీఐ లాంటి అంశాల్లో కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ఓటేస్తే మోదీకి, బీజేపీకి వేసినట్టే.
– కేటీఆర్
రాజకీయ నాయకుల జీవితాలు బయటికి కనిపించేలా ఉండవన్న సంగతి గోపీనాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థం అవుతుంది. గోపీనాథ్ హఠాత్తుగా దూరమవుతారని అనుకోలేదు. 200 గజాల చిన్న ఇంట్లోనే ఆయన నివసించేవారు. ఆయన ఇద్దరు బిడ్డలు కూడా ఇంకా సెటిల్ కాలేదు.
– కేటీఆర్