Bala Krishna | నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం NBK111 షూటింగ్ సందర్భంగా గాయపడిన విషయం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. రాజమండ్రి సమీపంలో జరుగుతున్న సినిమా చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ఎడమ మోకాలికి గాయం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక మెడికల్ బులెటిన్ ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడం, వాపు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ పరిస్థితి కండరాల చీలిక (మజిల్ టియర్) ఉండే అవకాశాన్ని సూచిస్తోందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు పూర్తి స్థాయి క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణ గత వైద్య చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ మెడిసిన్, ఇతర విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. అన్ని పరీక్షల ఫలితాల ఆధారంగా అత్యంత సురక్షితమైన చికిత్స విధానాన్ని ఖరారు చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఆయన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, పరీక్షలు పూర్తయిన తర్వాత తదుపరి చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏఐజీ ఆస్పత్రి పేర్కొంది.
ఇక బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ NBK111 షూటింగ్లో పాల్గొని అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక బాలయ్య 45 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోనున్నట్టు సమాచారం. బాలయ్య నటిస్తున్న NBK111 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గాయం కారణంగా షూటింగ్కు తాత్కాలిక విరామం పడే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.