తెలుగు భాష సాధించిన ఇంకొక విజయం గురించి చెప్పుకోవడం అవసరం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్రాస్ హైకోర్టులో తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని కేసు వేశాడు. చంద్రబాబుకు భాష మీద చాలా ప్రేమ ఉందని పొరపాటు పడకండి. అది ఎందుకు చేశాడంటే, ప్రతి విషయంలో తమిళులతో ఆంధ్రవారికి పోటీ ఉంటుంది పాత సోదర వైరం ఉండనే ఉందిగా! అప్పటికే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళ భాషకు ఆ హోదా వచ్చింది మరి. అయితే ఆంధ్ర నాయకులు తెలుగుగా చెప్పుకొని నన్నయను (11వ శతాబ్దం) ఆదికవిగా, అనువదింపబడిన మహాభారతాన్ని మొదటి తెలుగు సాహిత్య గ్రంథంగా కోర్టుకు వివరాలు సమర్పించడంతో వాదనల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టివేసింది.
నన్నయ్య పుస్తకం వెయ్యేండ్ల కంటే తక్కువ కాలంలో రాసినది అనీ, పైగా అది అనువాదమనీ ఆ కేసు ఓడిపోయాడు బాబు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ ఆ కేసును తిరగదోడి, ప్రమాణాలుగా తెలంగాణలోని సాహిత్యం, 2000 ఏండ్ల నాటి తెలుగు శాసనాలు, పద్య కవితలను సమర్పించడంతో మద్రాస్ హైకోర్టు తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చింది. హోదా వచ్చింది తెలంగాణ తెలుగుకు, ఆంధ్రుల భాషకు కాదు.
అసలు ఆంధ్రులు తెలుగు, ఆంధ్రం ఒకే భాష అని కథలల్లి ఉమ్మడి రాష్ర్టాన్ని రాజకీయంగా సాధించారు. కానీ, సామాజిక సమానత్వం గాని, ఈ ప్రాంత సాహిత్యానికి గౌరవం గాని చూపలేదు. తెలుగు సాహిత్యంలో 22 ప్రక్రియల్లో తెలంగాణ కవులు మొట్టమొదటగా కవిత్వం వెలువరించారు. కానీ, ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు తెలంగాణ సాహిత్య చరిత్రను అణచివేసి, ఆ 22 ప్రక్రియల్లో ఆంధ్ర కవులే ప్రప్రథమంగా రాశారని అబద్ధాలు రాశారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో తెలుగు అసలు పెరగలేదన్నారు. నన్నయ్య ఆదికవి అని చెప్పుకొనే ఆంధ్రభాషకు 1,000 ఏండ్ల చరిత్ర ఉంటే, తెలంగాణ తెలుగు మూడో శతాబ్దానికి పూర్వం నుంచే ప్రజల భాషగా ఉన్నట్టు ఆధారాలున్నాయి. అంతేకాదు, తెలుగులో ఆదికవి నన్నయ్య కాదు; ఆయన కంటే 150 ఏండ్లకు ముందే వేములవాడకు చెందిన మల్లియ రేచన ‘కవిజనాశ్రయము’ అనే గ్రంథాన్ని రచించాడు. కనుక తెలుగు ఆదికవి మల్లియ రేచన అవుతాడు. ఆంధ్రులు నన్నయను గౌరవించదలచుకుంటే వారి భాష ఆంధ్రమే అని ఒప్పుకొని, నన్నయను ఆంధ్ర భాషకు ఆదికవి అని పిలుచుకోవచ్చు.
ఆంధ్ర రాజకీయ నాయకులు, చరిత్రకారులు ఇంత వివక్ష చూపుతుంటే వారి ప్రాంతాలకు చెందిన వారి మీడియా-వార్తా పత్రికలు, దూరదర్శన్, యూట్యూబ్ మాధ్యమాలు.. 1956 నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా, 2014 నుంచి స్థానికులకు, స్థానికులతో ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేక శక్తుల లాగానే పనిచేస్తున్నాయి. 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడగానే ఖంగుతిన్నారు వీరందరు. మోసపూరిత రాజకీయాలలో భారతరత్న ఇవ్వదగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు తగిన సహచరుడైన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కలిసి అత్యద్భుతమైన నాటకంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలను బెదిరించి 15 రోజులలోనే కేంద్ర ప్రభుత్వం తాను అత్యున్నత సభ పార్లమెంట్లో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునేట్టు చేయగలిగారు. ఇక తర్వాత ఐదేండ్లు తెలంగాణలో తిష్ఠ వేసుకొని వ్యతిరేక వార్తలు రాసే ఆంధ్ర వారి మాధ్యమాలకు అడ్డూ అదుపూ లేకపోయింది. ఉన్నవీ, లేనివీ వండి వార్చి వడ్డించారు. శ్రీశ్రీ అన్నట్టు విష పుత్రికలు అన్న బిరుదును సార్థకం చేసుకున్నారు. ఈ మాధ్యమాలు 2023 డిసెంబర్ నుంచి ఎలా ప్రవర్తిస్తున్నాయో అందరూ చూస్తున్నారు కాబట్టి, ఇంకా వీటి గురించి ఎక్కువ రాయనక్కర్లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ‘ఇక్కడ బతుకడానికి వచ్చిన వారితో మాకు సమస్యలు లేవు. ప్రాంత వ్యతిరేకులతోనే ఆ సమస్య. 1956 తర్వాత వచ్చినవారిని కూడా ‘సెటిలర్స్ అనవద్దు’ అని కొత్త ప్రభుత్వం చాలా హుందాగా ప్రకటించింది. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారిలో ఇక్కడి సమాజం, ప్రాంత సంస్కృతి నచ్చిన వాళ్లూ ఉన్నారు. ఆంధ్ర నాయకుల ప్రభుత్వం మళ్లీ ఇక్కడ రావాలని అనుకుని ఆ రకంగా స్థానిక ప్రభుత్వాన్ని పడదోయాలని చూసేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండి తెలంగాణకు మంచి చేసిన, చేయాలనే తపన, చేసే ప్రజ్ఞ ఉన్న ప్రతినిధులనే ప్రతి ఎన్నికల్లో ఎన్నుకుంటే 2014 నుంచి 23 దాకా జరిగిన అభివృద్ధిని కొనసాగించవచ్చు.
ఆంధ్ర వాళ్లు విశాలాంధ్ర భజన చేస్తున్న రోజుల్లోనే కాక, అంతకుముందు నుంచీ తెలంగాణ ప్రజలకు ఆంధ్రులు అంటే విముఖత ఏర్పడటానికి చాలా బలమైన కారణాలున్నాయి. 1920-30 సంవత్సరాల మధ్యనే తెలంగాణలో వివిధ ప్రాంతాలు చూసి ఆంధ్రులకు ఇక్కడ వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి వంటివి పండించుకోవడానికి అనువైన నల్లరేగడి భూములు కంటపడ్డాయి. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వల్ల నీటి వసతి సమృద్ధిగా ఉండింది. ఇక వారు తెలంగాణ ప్రాంతంలోని వైరా (ఖమ్మం), నిజాంసాగర్ (నిజామాబాద్), లక్నవరం, పాకాల (వరంగల్), ఘనపూర్ (మెదక్), కడెం (ఆదిలాబాద్) తదితర ప్రాంతాలకు వచ్చి భూములు కొనుక్కొని, ఖాళీగా ఉన్నవి ఆక్రమించి వ్యవసాయం మొదలుపెట్టారు. వీరిలో అత్యధికులు కృష్ణా, గుంటూరు జిల్లా వాసులే. అయితే వలస వచ్చామన్న సోయి లేకుండా స్థానిక ప్రజలతో అహంభావం, ఆధిపత్య ధోరణితో వ్యవహరించారు. వివిధ సందర్భాల్లో ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతి, భాషను అవహేళన చేయడంతో తెలంగాణ ప్రజలకు ఆంధ్ర వారి మీద మంచి అభిప్రాయం ఏర్పడలేదు. ఇక్కడి స్థానిక రైతులకు వ్యవసాయం చేయడం రాదని, వారు మంచి భాష మాట్లాడరని, తెలంగాణ వారంతా తెలివి తక్కువవారు, బద్ధకస్తులు, సోమరిపోతులు, తాగుబోతులని నోటికి వచ్చినట్టు మాట్లాడేసరికి ఆంధ్ర వారి మీద ఏ మాత్రం మంచి అభిప్రాయం కలిగే అవకాశం లేకుండా పోయింది.
అప్పటిదాకా వందల సంవత్సరాల పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు వేలల్లో ఇక్కడికి వచ్చి స్థిరపడినా, వారు స్థానిక ప్రజలతో స్నేహంగా మెలిగారే తప్ప, ఎవరూ ఆంధ్ర వారిలాగా ప్రవర్తించలేదు. వీరు మాత్రం ఒక్క శాతం కూడా తెలంగాణ సంస్కృతిలో కలవకపోగా, నిరంతరం హేళన చేస్తూనే ఇక్కడ తిండి తిన్నారు, ఇక్కడి గాలి పీల్చారు, ఇక్కడే బతుకుదెరువు తెల్లార్చుకున్నారు. ఇక్కడి పండుగలలో స్థానికులతో కలువకపోగా వారి నివాసాలు కూడా వీరికి దూరంగా గుంటూరు పల్లెలని, రెడ్డిగూడెంలని ఏర్పాటు చేసుకొని బతికారు. ఈ అనాదరం, ఒంటెత్తు గుణాలు, వారిపై స్థానికులలో వ్యతిరేకతను బలంగా పెంచాయి.
కొన్ని కారణాల వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో చదువలేని విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు ప్రవేశం ఇవ్వాలని వైస్ ఛాన్స్లర్ కట్టమంచి రామలింగారెడ్డిని అభ్యర్థించగా, ఆయన ‘నిజాం రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రవేశం ఇవ్వను’ అని నిరాకరించాడు. ఆ విద్యార్థులకు నాగపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆదరించి నాగ్పూర్, జబల్పూర్ కాలేజీల్లో సీట్లు ఇచ్చాడు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా అత్యుత్తమ పాలన అందించిన పీవీ నరసింహారావు గారు కూడా ఉన్నారు. ఇదీ ఆంధ్ర ‘సోదరుల’ ప్రేమ తెలంగాణ వారి మీద!
అంతేకాదు, రజాకార్ల బాధ పడలేని కొన్ని కుటుంబాలు సరిహద్దు ప్రాంతాలైన ఇతర రాష్ర్టాల్లోకి వెళ్లాయి. సోలాపూర్, నాగ్పూర్, బొంబా యి, పుణె మొదలైన మహారాష్ట్రలోని పట్టణాలకు, కిందవైపు విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇంకొందరు వెళ్లారు. కా నీ, వీరికి ఎదురైన అనుభవాలు ఘోరమైనవి. ఇం టి అద్దెలు పెంచేసి, పాలు, పెరుగు ధరలు పెంచేసి వారిని దోచుకున్నారు. అద్దెకున్న వారి నగలను, వస్తువులను దోచుకున్నారు. దాస్తామని చెప్పి తీసుకొని తిరిగివ్వలేదు. నైజాం ప్రజలు సంపన్నులని హోటళ్లలో, లాడ్జీలలో ధరలన్నీ పెంచేశారు. కానీ, మహారాష్ట్ర వైపు వెళ్లినవారిని అక్కడి ప్రజలు ఆదరించి, రూములు ఫ్రీగా ఇచ్చి, వారిని సొంత మనుషుల్లా చూసుకున్నారు. హైదరాబాద్లో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి వచ్చిన కుటుంబాలు వారి అనుభవాలు కథలుగా చెప్తుంటే మహారాష్ట్ర ప్రజల మానవీయతకు మురిసిపోయినవారు, ఆంధ్రుల ప్రవర్తనకు నిర్ఘాంతపోయారు. ఇదీ ఆంధ్ర వారి మంచితనం వేరే వారి పట్ల!
ఇట్లా ఆంధ్ర వారి సంస్కారం కొద్ది కొద్దిగా రుచి చూసి వారితో ఒకే రాష్ట్రంగా కలిసి బతుకటానికి తెలంగాణ ప్రజలు చాలా భయపడ్డారు, వ్యతిరేకించారు. వారి భయాలు 57 ఏండ్ల ఏడు నెల ల్లో బలపడ్డాయే కానీ ఏ మాత్రం వారి పట్ల సౌహార్ద్రత పెంచుకోవడానికి వీలుపడలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులు గాని, తెలంగాణకు ఉద్యోగాల వల్ల, వ్యాపారాల కోసం వలస వచ్చిన జనాలు గాని తమ పట్ల తెలంగాణ సామాన్య ప్రజలకు కలిగిన ఏహ్యభావం తగ్గించుకోవాలని ఏ మాత్రం ప్రయత్నించలేదు. రాజధాని కట్టుకునే చేవలేక, ఆర్థికంగా రాష్ర్టాన్ని బలపరుచుకునే సత్తా లేక కలవడం కోసం నాటకాలాడి, కలిశాక వాళ్ల నిజస్వరూపం చూపిన వీరి మీద ఎప్పటికీ తెలంగాణలో మంచి అభిప్రాయం కలుగదు. (ద వాంక్విష్డ్ కేమ్ అండ్ యాక్టెడ్ యాజ్ విక్టర్స్) ఓడిపోయి వచ్చినవాళ్లు విజేతల్లా ప్రవర్తించారు. కలవడానికి ఎన్ని నాటకాలు ఆడారో వచ్చే వ్యాసంలో!
– దంటు కనకదుర్గ