తానా అంటే తందాన!కార్మిక సంక్షేమ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం బోర్డు చైర్మన్ లేనప్పుడు రూ.50 కోట్లలోపు ఉన్న బడ్జెట్‌పై మాత్రమే కార్మిక శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతకంటే రూపాయి పెరిగినా బోర్డు చైర్మన్ నిర్ణయం తప్పనిసరి. ఈ వివాదాస్పద ఫైల్‌కు సంబంధించిన లావాదేవీలు నడుస్తున్న సమయంలో కార్మిక శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నది. దీంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ను బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా నియమించి, ప్రీమియానికి సంబంధించిన రూ.346 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయించారు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్య కార్యదర్శి హోదాలో, లేదా బోర్డు తాత్కాలిక చైర్మన్ హోదాలో దానకిశోర్ ఈ నిర్ణయాన్ని అడ్డుకొని కార్మిక నిధిని కాపాడాల్సి ఉండె. కానీ అది జరగలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): తమ కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పెద్దలు కలిసి యథేచ్ఛగా కొల్లగొట్టారు. ముఖ్యనేత, ఆయన అనుచరులు, ఒక ముఖ్య అధికారి కలిసి పేదల సొమ్ము రూ. 346.36 కోట్లను పక్కదారి పట్టించారు. కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్య పథకాల నిర్వహణ ఇప్పుడు గాలిలో దీపంలా మారింది. ఈ పథకాల నిర్వహణ నుంచి ప్రభుత్వం అనూహ్యంగా తప్పుకొన్నది. ఆ బాధ్యతలను ఊరూపేరూలేని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు, కార్మిక సంఘాలకు తెలియకుండా సీఎంవోలోని ఓ ప్రత్యేకాధికారి కర్ర పట్టుకొని నడిపించిన ఈ తతంగంపై ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనాత్మక కథనం..
కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు
రాష్ట్రంలో 2007 నుంచి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా ‘భవన కార్మిక సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేశారు. దీనికి కార్మిక శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. చట్టం ప్రకారం కార్మిక శాఖ ఒక్కో కార్మికుడి నుంచి సభ్యత్వ రుసుము కింద ఏటా రూ.110 వసూలు చేస్తుంది. చెల్లించినవారికి ఐదేండ్ల గడువుతో లేబర్ కార్డు మంజూరు చేస్తుంది. లేబర్ కార్డు కలిగిన కార్మికుడిని సంక్షేమ బోర్డులో సభ్యుడిగా పరిగణిస్తారు. దీనికితోడు భవనాలు, నిర్మాణాల కాంట్రాక్టర్లు, ఓనర్ల నుంచి ప్రభుత్వం 1 శాతం సెస్ వసూలు చేస్తుంది. ఈ నిధులను కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
3 కోట్లు విలువచేయని కంపెనీకి రూ.346 కోట్లు
సభ్యులుగా ఉన్న కార్మికులు మరణించినా లేదా గాయపడి దివ్యాంగులుగా మారినా బోర్డు నుంచి బీమా సౌకర్యం కలుగుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక వైకల్య బీమా పథకాలను నిర్వహిస్తున్నది. ఈ బాధ్యతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకొన్నది. వాటి నిర్వహణ బాధ్యతలను ముంబైకి చెందిన ‘ట్రెయిల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 22న జీవో 12ను విడుదల చేసింది. ఈ జీవోను గోప్యంగా ఉంచింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్షేమ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, పనులను ఇక నుంచి ఈ బ్రోకర్ కంపెనీ మధ్యవర్తిత్వం చేస్తూ నిర్వహిస్తుందన్నమాట.
బీమా నిర్వహణ అప్పగించిన రెండు రోజుల్లోనే ట్రయిల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీ ఖాతాలోకి రేవంత్ ప్రభుత్వం రూ.346 కోట్లు జమ చేసింది. బోర్డు తాత్కాలిక చైర్మన్ హోదాలో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నిర్ణయం తీసుకున్నారు. ట్రెయిల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ అనామక కంపెనీగా తెలుస్తున్నది. దీని అధీకృత వాటా మూలధనం కేవలం రూ.3 కోట్లుగా, చెల్లింపు మూలధనం రూ 2.50 కోట్లు మాత్రమే ఉన్నది. ఇంత చిన్న కంపెనీకి రూ.వందల కోట్ల కార్మిక బీమా బ్రోకరేజీ వ్యవహారాలు కట్టబెట్టడంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
ఎల్ఐసీని కాదని అనామక కంపెనీకి
కార్మికుల బీమా నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ప్రభుత్వం ఓపెన్ టెండర్ విధానంలో బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. ఈ క్రమంలో ట్రెయిల్ బ్లేజర్ కంపెనీ సలహాలు, సూచనలు తీసుకున్నది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీతో పాటు మరికొన్ని బీమా సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే కార్మిక శాఖ అనూహ్యంగా ఎల్ఐసీ వంటి దిగ్గజాన్ని పక్కనబెట్టి కనీసం రూ. 2 కోట్ల మూలధనం కూడాలేని ‘క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్’ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసింది. బెంగళూరు కేంద్రంగా నడిచే ఈ కంపెనీ 2019లో ప్రారంభమైంది. కేవలం 43 మంది ఉద్యోగులతో నడుస్తున్నది. 2024కు సంబంధించి కంపెనీ విడుదల చేసిన అధికారిక షార్ట్‌నోట్స్ ప్రకారం 2024-25 వార్షిక చెల్లింపులు రూ 2.80 కోట్లు మాత్రమే. కంపెనీ మూలధనం రూ.1.68 కోట్లుగా ప్రకటించింది.
ఇంత చిన్న కంపెనీకి ట్రెయిల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీ ద్వారా ఒకేసారి రూ. 250 కోట్ల నగదును కార్మిక శాఖ బదిలీ చేసింది. మరో రూ.96.46 కోట్లను ముంబై కేంద్రంగా పని చేస్తున్న హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించింది. రెండు కంపెనీలకు కలిపి రూ.346 కోట్లను అప్పగించి 45 రోజులు దాటుతున్నా.. నియమ నిబంధనలు రూపొందించలేదని కార్మిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనిని బట్టి పెద్ద మొత్తంలో నిధులు దారిమళ్లినట్టు చర్చ జరుగుతున్నది. అంతేకాదు.. ఎల్ఐసీతోపాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీల్లో ఏడు షెల్ కంపెనీలేనని, టెండర్ దక్కించుకోడానికే కొందరు పెద్దలు ఇలా చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రీమియం చెల్లింపులో హడావుడి ఎందుకు?
కార్మిక సంక్షేమ బోర్డులో ప్రస్తుతం 14.93 లక్షల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. మరో 1.88 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు 35 వేల మంది వరకు మరణించి ఉంటారని బోర్డు అంచనా వేస్తున్నది. కానీ కార్మిక శాఖ ఈ లెక్కలన్నింటినీ పట్టించుకోకుండా గంపగుత్తగా 15 లక్షల మంది కార్మికులకు ప్రీమియం చెల్లించింది. ఒక్కో కార్మికునికి రూ.2309.10 చొప్పున 15 లక్షల మందికి కలిపి మొత్తంగా రూ.346.36 కోట్ల ప్రీమియం చెల్లించింది. చనిపోయిన వారిని తీసేసి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తే ఈ భారం తగ్గేదని కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇవేమీ చేయకుండా హడావుడిగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
డబ్బులు తీసుకున్నాక కొర్రీలు.. అడిగితే దాడులు?
ప్రైవేట్ బీమా కంపెనీ 15 లక్షల మందికి సంబంధించిన రూ.346 కోట్ల ప్రీమియం డబ్బులు చేతిలో పడగానే ‘కటాఫ్ తేదీ’ అంటూ కొర్రీలు పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జూలై 27 తర్వాత మరణించిన కార్మికులను మాత్రమే బీమా లబ్ధిదారులుగా గుర్తిస్తామనే నిబంధనను అమల్లోకి తెచ్చిందని చెప్తున్నారు. అంతకంటే ముందు చనిపోయిన కార్మికులు తమ పరిధిలోకి రారని, ఆయా లావాదేవీల విషయమై బోర్డునే సంప్రదించాలని మెలిక పెట్టినట్టు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించేలా ఉన్న ఈ నిబంధనకు కూడా కార్మిక శాఖ అంగీకారం తెలిపినట్టు తెలిసింది. మరోవైపు ట్రెయిల్ బ్లేజర్ కంపెనీ కార్యకలాపాల కోసం కార్మిక శాఖ భవన్‌లోనే విశాలమైన గదిని కేటాయించారని సమాచారం.
దానికి అద్దాల గోడలు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన ఈ గదికి అద్దె వసూలు చేస్తారా? ఎంత మేరకు చేస్తారనేదానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. ముఖ్యనేత కార్యాలయంలోని వ్యక్తుల కనుసన్నల్లో ఈ కంపెనీ నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిబంధనలపై ప్రశ్నించి, ఎదురు తిరిగిన పాలసీదారులపై కంపెనీ ప్రతినిధులు దాడులకు పాల్పడుతున్నారని సమాచారం. పాలసీ చెల్లింపులపైనా కొర్రీలు పెడుతున్నారని తెలిసింది. ప్రభుత్వ పెద్దలు, కార్మిక శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘అంతకు మించి’ చెల్లింపులు ఎందుకు?
నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గతంలో పాలసీ తీసుకొచ్చింది. అయితే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ బోర్డుకు భారం కాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టింది. బోర్డు నిబంధనల ప్రకారం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలో గరిష్ఠంగా రూ.180 కోట్లను ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించవచ్చు. అంటే 15 లక్షల మందికి, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయాలనుకుంటే, ప్రీమియం రూ.1,200 చొప్పున మొత్తం రూ.180 కోట్లు చెల్లించాలని బోర్డు నిబంధనలు చెప్తున్నాయి. పైగా కార్మికులకు సంక్షేమ బోర్డు చెల్లించిన నష్టపరిహారం ఎంతన్న లెక్కలను పరిశీలిస్తే, గత మూడేండ్లలో సగటున రూ.298 కోట్లకు మించి చెల్లింపులు లేనేలేవు. అది కూడా ప్రభుత్వం ద్వారానే ఈ చెల్లింపులు జరిగాయి. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం అనామక ప్రైవేట్ కంపెనీలకు రూ.346 కోట్ల నిధులు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు మించి సుమారు రూ.70 కోట్ల మేర, గత చెల్లింపులకు మించి దాదాపు రూ.50 కోట్ల మేర బోర్డుపై ఆర్థిక భారం ఎందుకు మోపారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీఎత్తున డబ్బు చేతులు మారినట్టు విమర్శలొస్తున్నాయి. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కార్మిక సంక్షేమ బోర్డు కింద రూ.2,300 కోట్ల నిధి ఉన్నది. గడిచిన రెండేండ్లలోనే ఈ నిధి నుంచి రూ. వెయ్యి కోట్లు ఖర్చయినట్టు సమాచారం. అయితే, వాటిని దేనికోసం ఖర్చు చేశారో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.
అన్నీతానై నడిపిన ప్రత్యేకాధికారి
కార్మిక బీమా సంక్షేమం నుంచి బోర్డు తప్పుకోవడం, ఆ బాధ్యతలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించడం, రెండు రోజుల్లోనే నిధులు మళ్లించడం వంటి ప్రక్రియలు మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక అధికారి కనుసన్నల్లో జరిగినట్టు కార్మిక శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. తాను ఢిల్లీలో పని చేసినప్పుడు పరిచయమైన వివిధ నగరాలకు చెందిన ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో ముందుగా మాట్లాడుకొన్న తర్వాతే అన్నీ తానై ఈ వ్యవహారాన్ని నెరిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల మెడ మీద కత్తిపెట్టి, సచివాలయంలోని సెక్షన్లలో ఒత్తిడి చేసి మరీ ఈ పని చేయించినట్టు సమాచారం. ప్రతిచోటా ముఖ్యనేత పేరు చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చినట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఫైల్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులను బదిలీపై గాని, సెలవులపై గాని వెళ్లిపోవాలని, ఆ స్థానంలో మరొకరితో పని చేయించుకుంటామని బెదిరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత అండదండలు లేకుండా ఆ అధికారి యథేచ్ఛగా ఆయన పేరును ఎలా వాడుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏకంగా మంత్రిపైనే ఒత్తిడి?
సదరు ప్రత్యేకాధికారి బెదిరింపులు మంత్రి వరకు చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీమా వ్యవహారాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించే ఫైల్ సచివాలయంలో నడిచే సమయంలో కార్మిక శాఖకు మంత్రి లేరు. అయితే అధికారిక ఉత్వర్వులు ఇవ్వాల్సిన సమయం వచ్చే సరికి మంత్రిని నియమించారు. దీంతో బోర్డు చట్టం ప్రకారం కార్మిక శాఖ మంత్రి బోర్డుకు అసలైన చైర్మన్ అవుతారు. కాబట్టి ఆ ఫైల్ మీద చివరి సంతకం మంత్రి చేయాల్సి వచ్చింది. దీంతో ప్రత్యేకాధికారి రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం. ‘ఈ ఫైల్‌ను ముఖ్యనేత ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది’ అని చెప్పి ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ముఖ్యనేత పేరు చెప్పడంతో సదరు మంత్రి వెనకాముందు ఆలోచించకుండా ఫైల్‌పై సంతకం చేసి పంపినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది.
కార్మికుల సొమ్ము ఎలా పక్కదారిపట్టిందంటే?