సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను జిల్లా అధికారులు శాఖల వారీగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.
అదేవిధంగా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష చేస్తూ వచ్చే సోమవారం నాటికి పరిష్కరించాలని, దీనిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజావాణికి అధికారులంతా సమయానికి హాజరై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వీల్‌చైర్‌పై వచ్చిన ఓ దివ్యాంగ వృద్ధ మహిళ వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా వినతిపత్రం తీసుకున్నారు.
అనంతరం ప్రజావాణి సమావేశాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో స్టీల్ బాటిళ్లను వినియోగించడం ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆమె సూచించారు. హైదరాబాద్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నిశితా గుండెపోటుతో మృతి చెందడంతో ఆమెకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరివన్ పలని, ముకుందరెడ్డి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, ఇన్చార్జి డీఆర్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.