సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అసలే సిబ్బంది కొరతతో వైద్యం భారంగా మారిన ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఇటీవల జరిగిన బదిలీలు, డిప్యుటేషన్లతో మరోసారి వైద్యుల కొరత, పనిభారం తీవ్రమైంది. గత సంవత్సరం జరిగిన బదిలీలతో ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న నిలోఫర్, ఎంఎన్‌జె, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానల్లోని పోస్టులు 40 శాతం మేర ఖాళీ అయ్యాయి.
దాదాపు సీనియర్ ప్రొఫెసర్లందరూ నగరం దాటి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు, వాటి అనుబంధ దవాఖానలకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల పరిధిలోని దవాఖానల్లో వైద్యుల కొరత ఏర్పడింది. గత సంవత్సరం ఖాళీ అయి న స్థానాలే నేటికీ భర్తీ కాలేదు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో నేటికీ ఒకే ఒక్క ప్రొఫెసర్ ఉన్నారు.
ఆయన కూడా సూపరింటెండెంట్‌గా దవాఖాన పరిపాలనా విధు లు నిర్వహిస్తూ మరో పక్క వైద్య విద్యార్థులకు బోధన, రోగులకు వైద్యం అంది స్తూ నిత్యం బిజీగా ఉంటున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోటి ఈఎన్టీ, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, మానసిక రోగుల ఆస్పత్రుల్లో నెలకొన్న సీనియర్ వైద్యుల కొరత కారణంగా అటు రోగులు, బోధనా సిబ్బంది లేక ఇటు వైద్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్లో ట్రయల్ రన్ ఓపీ మొదలైంది. త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో వాయిదాపడింది. అవసరమైన సిబ్బంది, వైద్యులకు సంబంధించి నూతన నియామకాలను జరపకుండా ఇతర దవాఖానల నుంచి వైద్య సిబ్బందిని సర్దుబాటు చేస్తోంది.
1,000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు కనీసం కాంట్రాక్ట్ పద్ధతిన కూడా ఒక వైద్యుడి పోస్టును భర్తీ చేయకపోవడం విడ్డూరం. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర టీచింగ్ హాస్పిటల్స్‌లో ఉన్న ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్‌ను డిప్యూటేషన్‌పై టిమ్స్ కు తరలించింది. ఒక్క ఉస్మానియా నుంచే గతేడాది 34మంది ఫ్యాకల్టీ, 46 మంది రెసిడెంట్స్, గాంధీ నుంచి 24 మంది ఫ్యాకల్టీ, 12 మంది రెసిడెంట్స్, నిలోఫర్ నుంచి 5 మంది ఫ్యాకల్టీ, ఇద్దరు రెసిడెంట్స్, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన నుంచి 9 మంది ఫ్యాకల్టీ, 10 మంది రెసిడెంట్స్, మానసిక రోగుల దవాఖాన నుంచి ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు రెసిడెంట్ల చొప్పు న టిమ్స్కుడిప్యూటేషన్ వేశారు. దీంతో అప్పటికే వైద్యుల కొరతతో సతమతమవుతున్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానల్లో సమస్యలు మరిం త తీవ్రమయ్యాయి.
ఇప్పటికే వైద్యుల కొరతతో నెట్టుకొస్తు న్న ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, మానసిక రోగుల దవాఖానల నుంచి ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్‌ను టిమ్స్‌కు డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంతో ఆయా దవాఖానల్లో పనిభారమంతా జూనియర్ వైద్యులు(జూడా), పీజీలపై పడనుందని అక్కడి వైద్యులు వాపోతున్నారు. ప్రతిరోజు 2 వేల మంది ఓపీ రోగులు వచ్చే ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానల్లో పని ఒత్తిడి తీవ్రవంగా ఉంటుందని, అలాంటి దవాఖానల నుం చి ఉన్న ఫ్యాకల్టీని తీసి ఇతర ఆస్పత్రులకు డిప్యూటేషన్‌పై వేయడంతో అక్కడి పనిభారమంతా జూనియర్లపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
నగరంలోని టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రొఫెసర్ల పాత్ర కీలకం. వైద్య విద్యార్థులకు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు వైద్య విద్యను బోధించాల్సి ఉంటుంది. థియరీటికల్తో పాటు రోగులకు వైద్య సేవలు అందిస్తూ ప్రాక్టికల్ విద్యను కూడా ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులకు అందిస్తారు. ఈ క్రమంలో అటు రోగులకు చికిత్స, ఇటు వైద్య విద్యార్థులకు బోధన అందించడంలో ఫ్యాకల్టీ కీలక పాత్ర పోషిస్తుంటారు. అంతటి ప్యాధాన్యత గల ఫ్యాకల్టీని ఒకేసారి అనాలోచితంగా టిమ్స్‌కు డిప్యూట్ చేయడంపై ఉస్మానియా, గాంధీ వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కళాశాలలోన్ని ఫ్యాకల్టీని తీసుకెళ్లి టిమ్స్‌కు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.