Soda | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : సమ్మర్ వచ్చేసిందని ఎక్కడ పడితే అక్కడ సోడాలు తాగేందుకు వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి. ఇలాగే దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తికి ఓ షాపు యజమాని కాలం చెల్లిన సోడాను అందజేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. రివర్స్‌లో కస్టమర్‌నే బెదిరించాడు. మేం ఇలాంటివే అమ్ముతాం.. తాగితే తాగు లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. పైగా డబ్బులు చెల్లించాలని దబాయించాడు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండా గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది.
వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌తండా పరిధిలోని ఫి1 రోడ్డు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన యమ్మి సర్కిల్ పేరుతో (హోటల్) ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి సోడా కావాలని కోరగా వెంటనే దుకాణ నిర్వహకుడు కాలం చెల్లిన సోడా అందించాడు. దీంతో సదరు వ్యక్తి మొదట చూడకుండా తాగేశాడు. ఆ తర్వాత సీసాపై ఉన్న తేదీని చూడగా ఈ నెల 4 తేది వరకు మాత్రమే ఉంది. దీంతో ఇదేమిటని సదరు నిర్వహకుడి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇక్కడ ఇలాగే ఉంటాయి. నువ్వు ముందు డబ్బులు చెల్లించు లేకపోతే ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తానని బెదిరించాడు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది.
ఈ విషయం తెలిసి మీడియా వాళ్లు అక్కడకు వెళ్లినప్పటికీ.. హోటల్ యజమాని మళ్లీ అంతే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. మా దగ్గర అన్నీ ఇలాగే ఉంటాయి.. మీ ఇష్టం ఉంటే తాగండి.. లేకపోతే లేదంటూ రుసరుసలాడటం గమనార్హం.
నిర్వహకుడిపై చర్యలు తీసుకోవాలి
కాలం చెల్లిన సోడాలు అమ్మడమే కాకుండా వినియోగదారులను బెదిరింపులకు పాల్పడుతున్న దుకాణ నిర్వాహకుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. వినియోగదారుల ఫోరం సభ్యులను కలిసి దుకాణ నిర్వహకుడిపై వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.