సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) ; ఆ డిస్కమ్ డైరెక్టర్‌కు ఓ కల వచ్చింది. అందులో తాను ఓ పాత బిల్డింగ్ ఓనర్‌ను దబాయిస్తున్నట్లు కనిపించింది. కొంచెం ఎక్కువ లోడ్ కావాలని అడిగినందుకు నీకు పర్మిషన్ ఉందా.. మున్సిపాలిటీ ఏం చేసింది.. అంటూ అడగడం, ఆ తర్వాత ఓసీ తెచ్చుకోమని చెప్పిన సీన్ అది. నిద్రలేచిన వెంటనే తన కలను సాకారం చేస్తూ వెంటనే ఓ కొత్త రూల్ ప్రకటించాడు. పాత బిల్డింగులకు కూడా ఓసీ కావాలని అందుకు కొన్ని జీఓలు ఉదహరించాడు. దీనికి తానా అంటే తందానా అన్నచందంగా ఆయన పై అధికారి సైతం తలూపారు. ఆ వెంటనే ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ఇలాంటివి ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్లో పరిపాటిగా మారిపోయాయి.
కొన్ని నెలలుగా దక్షిణడిస్కమ్లో రోజుకొక కొత్త నిబంధన తీసుకురావడంతో ఎప్పుడెలాంటి సర్క్యులర్ వస్తుందో తెలియక అధికారులు, వినియోగదారులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పాతభవనాలకు అదనపు లోడ్ కావాలంటే ఓసీ కావాలంటూ నిబంధన విధించడంతో ఇప్పుడు చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో మిగతా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో దక్షిణ డిస్కం ఇటువంటి నిబంధనలు తీసుకొస్తున్నదని విద్యుత్ అధికారులు చెప్పారు. అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకున్నా నిబంధనలకు విరుద్దంగా ఇన్నాళ్లూ అడ్డగోలుగా అనుమతులు జారీచేశారు. నకిలీ ఓసీతో కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి చాలా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు టీజీఎస్పీడీసీఎల్ గత కొన్నిరోజులుగా విద్యుత్ కనెక్షన్ల జారీని కఠినతరం చేసింది. గతంలో ఇచ్చిన కనెక్షన్లపై ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టడంతో పాటు బాధ్యులైన సిబ్బంది, కాంట్రాక్టర్లపై చర్యలకు పూనుకుంది. ఇప్పుడు అదనంగా లోడ్ విషయంలో పాత బిల్డింగులు అందులోనూ పదిమీటర్ల కంటే ఎత్తులో ఉండి 2017 సంవత్సరం తర్వాత నిర్మించినవాటికి ఈ నిబంధన వర్తింపజేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే పాతవాటి విషయంలో కూడా ఇంకా సందిగ్దత కొనసాగుతున్నదని అసలు లోడ్ ఇవ్వాలా వద్దా అనే విషయం సీఎండీ వద్ద తేలాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
వినియోగదారులకు తప్పని ఇబ్బందులు..
– నూతన కనెక్షన్ కోసం ఫైళ్లు పెట్టి 3-4 నెలలు దాటినా కదలకపోవడంతో అధికారులను అడిగితే ఓసీ కావాలని చెబుతున్నారని ఓ భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
– సెంట్రల్ సర్కిల్లో ఎనిమిదేళ్ల భవనానికి అదనపు లోడ్ అవసరమైంది. దీంతో తమ వినియోగానికి సంబంధించి లోడ్ కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదనపులోడ్ కావాలంటే ఓసీ కావాలంటూ డిస్కం అధికారులు చెప్పారు.
– ఇదే తరహాలో కర్మన్‌ఘాట్‌లోని పదేళ్ల క్రితం భవనానికి గతంలో అవసరాన్ని బటి ్టపరిమిత లోడ్‌తో కనెక్షన్లు తీసుకున్నారు. ఇటీవల వినియోగం పెరిగింది. ఇప్పుడు 160 కేవీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అదనపు లోడ్ అయినా ఓసీ కావలసిందేనంటూ అధికారులు చెప్పారు. వారు ఓసీ సమర్పించకపోవడంతో మూడునెలలుగా దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది.
పెండింగ్‌లో వేల దరఖాస్తులు..!
నిబంధనలు కఠినతరం చేయడంతో వేలసంఖ్యలో దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఇటీవల నకిలీ ఓసీలు, ఫేక్ సర్టిఫికెట్లతో కనెక్షన్ల బాగోతంపై విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులకు మెమోలు ఇవ్వగా కాంట్రాక్టర్లపై కూడా చర్యలకు పూనుకుంది. ఈనేపథ్యంలో తమ పరిధిలో ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలన్నా, అదనపు లోడ్ కావాలంటూ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నా.. ఆయా సర్కిళ్ల అధికారులు ఎక్కడా రాజీపడడం లేదు. దీంతో గ్రేటర్‌లోని 10 సర్కిళ్ల పరిధిలో విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్నవివాటికి సరైన పత్రాలు లేవంటూ వేల సంఖ్యలో పెండింగ్‌లో పెట్టారు. విద్యుత్ కనీస అవసరం కాబట్టి ఒకవేళ ఎవరికైనా అవసరమైతే కేటగిరీ 8 కింద కనెక్షన్ ఇస్తున్నామని, ఇందులో యూనిట్‌కు పన్నెండు రూపాయలు చార్జ్ చేస్తున్నామని అధికారులు చెప్పారు.
గతంలో నగరంలో చాలావరకు నోటరీ పత్రాలతో స్థలాలను కొనుగోలు చేసేవారు కాగా వీరికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌తో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ చార్జీలు వసూలు చేసి కనెక్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వీటికి సైతం కనెక్షన్లు ఇవ్వకుండా ఓసీ కావాలంటున్నట్లు ఓల్డ్‌సిటీకి చెందిన కొందరు వినియోగదారులు చెప్పారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్న కారణంగా కొందరు అధికారులు కనెక్షన్ ఇవ్వాలని అంటే, మరికొందరు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టత కోసం కార్పొరేట్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నట్ల్లు ఓ అధికారి తెలిపారు. పాతభవనాలకు అదనపు లోడ్ కోసం పెట్టిన ఫైల్స్ పెండింగ్‌లో ఉండడంతో కరెంట్ సమస్యలు వస్తూ విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నదని వినియోగదారులు అంటున్నారు. మరోవైపు కొత్త భవనాలకు కనెక్షన్ కోసం పెట్టిన ఫైళ్ల పెం డింగ్‌తో నగరశివారు ప్రాంతాలైన శంషాబాద్, మొయినాబాద్ తదితర చోట్ల కనెక్షన్లు లేక చాలా భవనాలు అంధకారంలో ఉన్నట్లు తెలుస్తోంది.