 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ హయాంలో తెచ్చిన ఉచిత నీళ్ల పథకాన్ని ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సకల హంగులతో విలసిల్లిన నగరం ఇప్పుడు కాంగ్రెస్ 22నెలల పాలనలో నరకం చూపిస్తున్నారని.. పింఛన్లు పెంచుతామని, మహిళలకు నెలకు రూ. 2500, ఆడబిడ్డలకు పెండ్లికి తులం బంగారం.. యువతులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ముల్లును ముల్లుతోనే తీసినట్టు ద్రోహపూరిత పార్టీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. శనివారం షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా తెలంగాణ భవన్లో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నగర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ‘షేక్‌పేటలో ఫ్లైఓవర్ కట్టినం..మల్కపేట చెరువును పునరుద్ధరించినం..రూ. 5కే మంచి భోజనం పెట్టినం.. సుస్తీ చేస్తే బస్తీ దవాఖాన పెట్టినం.. హిందూవులకు బతుకమ్మ చీరె, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక అందజేసినం’ అని గుర్తుచేశారు. కులమతాలకతీతంగా అన్నివర్గాలను కడుపులో పెట్టి చూసుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు బ్రహ్మండంగా ఓటుతో కేసీఆర్‌ను ఆశీర్వదించారని వివరించారు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు టికెట్ రేట్లను డబుల్ చేశారని విమర్శించారు. చివరకు చదువుకునే పిల్లల బస్‌పాస్ ఛార్జీలను 25 శాతం పెంచి వంచించారని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్, కేసీఆర్ పాలనకు తేడా తెలుసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. ముస్లింలకు బడ్జెట్లో రూ.4వేల కోట్లు ఇస్తామని, మైనార్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పి ఢోకా చేసిందని ఆరోపించారు.
ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను ఏం చేశారని నిలదీయాలని సూచించారు. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్‌ను కాపాడుకోవాలంటే జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుపెట్టాలని ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ చేపట్టిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన సతీమణి సునీత విజయానికి కృషిచేయాలని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, ముఠా జయసింహ, నందికంటి శ్రీధర్, విజయ్ పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ చేరిన వారిలో బీజేపీ, కాంగ్రెస్ షేక్‌పేట డివిజన్ మహేశ్రాజు..శేషురాజు, వినయ్‌రాజు, గణేశ్, రోహిత్, శ్రీకాంత్, నవీన్, వెంకటేశ్, శివాజీ, రోహిత్, డాక్టర్ విద్యారాణి, సంగీత, మేఘన, దివ్య, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, శ్రీదేవీ, విజయ, లావణ్య ఉన్నారు.
 
                            