సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లేకుంటే మీరు ఎందుకూ పనికిరారు’ అంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రతి ముస్లింను కదిలించాయి. ముస్లింలపై రేవంత్‌రెడ్డి తప్పుడుకూతలు కూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముస్లింల ఓట్ల పునాదిపైనే కాంగ్రెస్ బతుకుతున్నదన్న విషయాన్ని మరిచిపోయిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ముస్లిం నేతలను టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీలోకి మారాలంటూ బోరబండ మైనారిటీ నేత, బీఆర్ఎస్ నాయకుడు సర్దార్‌ను బెదిరించి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేసిన కాంగ్రెస్ నేతలు తాజాగా నువ్వు పార్టీ మారకపోతే ఇళ్లు కూల్చేస్తామంటూ బెదిరించి ఎర్రగడ్డకు చెందిన షరీఫ్‌ను తమ పార్టీలోకి బలవంతంగా తీసుకుపోయారు. స్థానికంగా షరీఫ్ ఖురేషికి మంచిపట్టు ఉండడంతో ఆయనను టార్గెట్ చేసి రేవంత్‌రెడ్డితో కండువా కప్పించారు.
షరీఫ్‌ను బెదిరించి..
ఎర్రగడ్డలో షరీఫ్ ఖురేషీకి పెద్దమనిషిగా పేరుంది. ముస్లింలు ఆయన చెబితే వింటారనే ప్రచారం ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ఆయనను టార్గెట్ చేశారు. ఆయన స్థానికంగా ఒక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కావడంతో తాను పార్టీ మారడానికి ఒప్పుకోలేదు. దీంతో షరీఫ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో బెదిరించినట్లు ఎర్రబండలో చర్చ జరుగుతుంది. బలవంతంగా ఆయనను సీఎం దగ్గరికి తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అంతకు ముందు వరకు తాము ఒక పార్టీకి పనిచేసి నిజాయితీగా ఉండి ఇప్పుడు ఎలా ప్రజలను వేరొకపార్టీకి అందులోనూ ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఉన్న కాంగ్రెస్‌కు ఓటేయమని చెప్పాలంటూ సన్నిహితుల దగ్గర అన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ను కాదనలేక, కాంగ్రెస్ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఛాతినొప్పితో ఆసుపత్రిపాలయ్యారు. నాలుగురోజుల పాటు ఆయన చికిత్స పొంది సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది.
అయితే తన ఫోన్లన్నీ స్విచాఫ్ పెట్టి కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. మరోవైపు తాను కాంగ్రెస్‌లో చేరకపోతే ఆయన ఇంటితోపాటు తనకు సంబంధించి వేసిన వెంచర్లలో ఇళ్లు కూల్చేస్తామని, వారినందరినీ ఆయనపైకి ఉసిగొల్పుతామంటూ బెదిరించారని, అంతేకాకుండా టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చి ఆయనపై కేసులు బనాయిస్తామని, పాతకేసులను తిరగదోడుతామని బెదిరించినట్లు ఎర్రగడ్డలో గుసగుసలాడుకుంటున్నారు.

ముస్లిం నేతలే టార్గెట్..!
గతంలో ఎప్పుడూ లేని రీతిలో కాంగ్రెస్‌నేతలు ముస్లింలను టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొన్న రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలపై గుర్రుగా ఉన్న ముస్లింలకు వరుసగా తమ వారిని పోలీసుస్టేషన్లకు పిలిపించడం, వారిని టాస్క్ఫోర్స్వారితో బెదిరించడం, పార్టీ మారాలంటూ ఒత్తిడి చేయడం వంటివి జరగడంతో చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆగడాలకు అక్కడి బీఆర్ఎస్ మైనారిటీ నేత సర్దార్ బలయ్యాడు. ఫసియుద్దీన్ నేరుగా సర్దార్కు ఫోన్ చేసి పార్టీ మారలని లేకపోతే డ్రగ్స్ కేసులో ఇరికించాలా..నువ్వు కట్టుకుంటున్న ఇల్లు కూల్చేస్తానంటూ బెదిరించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయన కుటుంబం సర్దార్ మృతికి కారణం బాబా ఫసియుద్దీనే అని నెత్తినోరు బాదుకున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు .సరికదా ఎన్నికల ప్రచారంలో ఏకంగా సీఎం పక్కనే బాబాను పెట్టుకుని ప్రచారంచేస్తూ ముస్లింలకు ఇటువంటివారినే మేం ప్రోత్సహిస్తాం మీరేం చేసుకుంటారో చేసుకోండంటూ పరోక్షంగా సవాల్ విసిరారని ముస్లిం పెద్దలు చర్చించుకుంటున్నారు. మసీదుల దగ్గరకు వచ్చి తమ పార్టీలోకి రాకపోతే బాగుండదంటూ బెదిరించారని చాలామంది ముస్లిం యువకులు, పెద్దలు బీఆర్ఎస్ నేతల దగ్గర వాపోయిన సందర్భాలున్నాయి. ముస్లింల పునాదులపైనే నిలుచున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని, ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతామంటూ స్థానిక ముస్లింలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.