కంటోన్మెంట్, ఆగస్టు 9 : పండుగతో పాటు వారాంతం కావడంతో ఇంటి నుంచి వెళ్లే క్రమంలో నగరంలోని ట్రాఫిక్ ప్రజలను నరకయాతనలో పడేసింది.. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో అన్నాతమ్ముళ్లను కలుసుకునేందుకు బయలుదేరిన యువతులు, మహిళలకు భారీ ట్రాఫిక్‌తో దర్శనమిచ్చింది. ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికుల తో కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సోదరులకు రాఖీ కట్టేందుకు, కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. మహాత్మాగాంధీ బస్టాండ్‌తో పాటు సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ సైతం ప్రయాణికులతో రద్దీగా మారింది. టికెట్ రిజర్వేషన్ కోసం ఉదయం నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు.
ఐదు కిలోమీటర్ల మేర భారీగా జామ్..
సికింద్రాబాద్-బొల్లారం చెక్‌పోస్ట్ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్ వెళ్లడానికి రెండు, మూడు గంటల సమయం పట్టింది. శామీర్‌పేట నుంచి జేబీఎస్‌కు వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఆర్టీసీ బస్సులు నెమ్మదిగా కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు కిక్కిరిసి పోయాయి.
రాఖీ స్పెషల్’ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడంతో జూబ్లీ బస్టాండ్, జేపీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు భారీ సంఖ్యల్లో కదిలారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించారు. దీంతో ఉత్తర తెలంగాణకు వెళ్లే రహదారి కిటకిటలాడింది. అలాగే.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై, ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్‌నగర్, ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్, బోయిన్పల్లి, శామీర్‌పేట, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజా గుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.ఉప్పల్, అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వెళ్లేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బస్సులు లేక జనం అవస్థలు..
ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్, ఇతరప్రాంతాల నుంచి తగినన్నీ బస్సులు లేకపోవడంతో రెండుగంటలపాటు వేచిఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. రాఖీ పండుగ కావడంతో ప్రజలంతా తండోపతండాలుగా రావడంతో.. ప్రయాణికులకు తగినన్నీ బస్సులు లేకపోవడంతో అవస్థలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సినవారు సైతం సీటు దొరకక అనేక ఇబ్బందులు పడ్డారు.