వికారాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎల్నినో ప్రభావం, నైరుతి రుతుపవనాల అనిశ్చితితో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చినా అనుకున్న స్థాయిలో వానలు కురవకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. జిల్లాలోని కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో అధిక లోటు వర్షపాతం నమోదు కావడంతో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజు లు వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని వ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు అప్పులు చేసి విత్తనాలను నాటిన రైతులు పంటలు ఎండుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు బిందెలతో పంటలకు నీరు అందిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా పదిహేను రోజుల ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జూలై 15 నుంచి జూలై 31 వరకు వర్షాలు కురవకపోతే ఏ ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఆగస్టు 1-ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే ఏయే పం టలు వేయాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించనున్నది.
ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావం..
జిల్లాలోని ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. జిల్లాలో సాధార ణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు సాధారణ వర్షపాతం 185.2 మి.మీటర్లు కురువాల్సి ఉండగా 114.1 మి.మీటర్లే నమోదైంది. జిల్లాలో ని ఐదు మండలాల్లో అధిక లోటు వర్షపాతం, మరో 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో సాధారణం కంటే 60శాతం నుంచి 99శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైంది. కులకచర్ల మండలంలో సాధారణ వర్షపాతం 172.8 మి.మీటర్లు కాగా కేవలం 42.6 మి.మీటర్లు నమోదుకాగా, 75 మి.మీటర్లు, బంట్వారం మండలంలో సాధారణ వర్షపాతం 195.2 మి.మీటర్లు కాగా కేవలం 26 మి.మీటర్లు, పెద్దేముల్ మండలంలో సాధారణ వర్షపాతం 207.4 మి.మీటర్లుకాగా, 17.9 మి.మీటర్లు, బషీరాబాద్ మండలంలో సాధారణ వర్షపాతం 191.9 మి.మీటర్లుకాగా, 29.6 మి.మీటర్లు, కొడంగల్ మండలంలో సాధారణ వర్షపాతం 181.6 మి.మీటర్లుకాగా, 38.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో లోటు వర్షపాతం నమోదైన మండలాల్లో.. మర్పల్లి మండలంలో సాధారణ వర్షపాతం 173.1 మి.మీటర్లుకాగా, 79.1 మి.మీటర్లు, నవాబుపేటలో 180.5 మి.మీటర్లకు 119 మి.మీటర్లు, పరిగిలో 180.6 మి.మీటర్లకు 125 మి.మీటర్లు, దోమలో 173.8 మి.మీటర్లకు 98 మి.మీటర్లు, ధారూరులో 199.2 మి.మీటర్లకుగాను 105.4 మి.మీటర్లు, కోట్పల్లిలో 194.2 మి.మీటర్లకుగాను 98.5 మి.మీటర్లు, తాండూరులో 205.7 మి.మీటర్లకుగాను 103 మి.మీటర్లు, యాలాలలో 189.5 మి.మీటర్లకుగాను 111.4 మి.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 168.8 మి.మీటర్ల వర్షపాతానికిగాను 78.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇప్పటివరకు 3,19,039 ఎకరాల్లో సాగు..
జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 4,85,849 ఎకరాలుకాగా ఇప్పటివరకు 3,19,039 ఎకరాల్లో ఆయా పంటల ను సాగు చేశారు. పత్తి 2,08,147 ఎకరాలు, కందులు 80,502, మొక్కజొన్న 21,704, పెసలు 2,296, జొన్న 163, మినుములు 723, సోయాబీన్ 930, ఇతర పంటలు 1,874, ఉద్యానవన పంటలు 1,560 ఎకరాల్లో రైతులు సా గు చేశారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని పంటలు ఎండుముఖం పట్టాయి. పంటలు ఎండుముఖం పడుతున్న దృష్ట్యా జిల్లా వ్యవసాయాధికారులు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించేలా ప్రణాళికను రూపొందించారు.