Land grabbers | బండ్లగూడ, మార్చి 7 : నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూమిని అమ్మేందుకు ప్రయత్నించిన భూ కబ్జాదారులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ కాలనీలో రూ. 4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. దీంతో ఆ భూమి యజమానికి తెలియకుండా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న యజమాని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూ కబ్జాకు యత్నించిన 14 మందిలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడుగురి నుంచి నకిలీ పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.