కందుకూరు, జనవరి 5 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతుడి అవయవాలను దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కందుకూరు పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పెద్దొళ్ల ప్రశాంత్‌రెడ్డి.. గత నెల 28న విధులను ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మలక్‌పేట్‌లోని యశోద వాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో మృతుడి తండ్రి, మాజీ ఏఎస్సై నాగిరెడ్డి, భార్య సౌమ్యలు పెద్ద మనస్సుతో జీవన్‌దాన్‌కు మృతుడి కిడ్నీలు, కాలేయాన్ని దానం చేశారు. తమ బిడ్డ ప్రాణం పోయిన బాధను గుండెల్లో దాచుకొని అవయవా లను దానం చేసిన మృతుడి కుటుంబ సభ్యులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు. అవయవాలను దానం చేసినవారు భౌతికంగా మరణించినా జీవించి ఉన్నట్లేనని అన్నారు. కానిస్టేబుల్ ప్రశాంత్‌రెడ్డి అంత్యక్రియ ఖర్చులకు రూ.90వేలను సీపీ మంజూరు చేశారు. అంత్యక్రియల్లో సీఐ సీతారాం, సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సువర్ణ, పోలీసులు పాల్గొన్నారు.