సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఈ సంవత్సరం వేసవి కాలంలో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా సరఫరా అయ్యే ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల మూలంగా అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. ఎండావానలకు ప్రభావితమవడంతో గత సంవత్సరం అనేక ప్రాంతాల్లో సరఫరాలో సమస్యలు వచ్చాయి. ప్రధానంగా వినియోగదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ విశ్లేషించుకోవడంలో టీజీఎస్పీడీసీఎల్ విఫలమవుతోంది. సాధారణంగా ఈ సమస్యలు తలెత్తినప్పుడు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా సమస్యలు వచ్చాయి.
ఈ సారి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ఎలా చేపట్టాలో క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షలు జరిగినప్పటికీ ఇప్పటివరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పూర్తి కాకపోవడం.. గత సంవత్సరం వలే సమస్యల తీవ్రత మార్చిలోనే పెరుగుతుండడంతో ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం, వర్షాకాలంలో సమస్యలు ఎక్కువగా వస్తున్నందున ఈ ఆరు నెలలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన ఫిర్యాదులతో ప్రతీయేడాది ప్రణాళిక రూపొందిస్తారు. కానీ ఈసారి అలా చేసినప్పటికీ యాక్షన్ ప్లాన్ అమలులో మాత్రం పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి.
అధికంగా ఫిర్యాదులు అక్కడే!
హైదరాబాద్ పరిధిలో పది సర్కిళ్లు ఉన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన ఫిర్యాదులు చూస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా సరఫరా లోపాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్లో అత్యధికంగా 1.54 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి 30,596, మేడ్చల్ నుంచి 24,296, హైదరాబాద్ సౌత్ నుంచి 21,652, బంజారాహిల్స్ పరిధిలో 17,581, సైబర్‌సిటీ నుంచి 15,864 మంది ఫిర్యాదులు చేశారు. వీటిలో ట్రాన్స్ఫార్మర్లు పాడవడం, ప్యూజులు పోవడం, ఎల్టీ లైన్, సర్వీస్ వైర్ లోపాలకు సంబంధించినవే ఉన్నాయి. గత సంవత్సరం సంగారెడ్డి పరిధిలో అత్యధికంగా 169, బంజారాహిల్స్,సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలో 97, హబ్సిగూడలో 65 బ్రేక్‌డౌన్స్ వచ్చాయి. ఈ సారి ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టినప్పటికీ కొన్నిచోట్ల పెరిగిన డిమాండ్ కారణంగా లోడ్ పెరుగుతోంది. మరోవైపు ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బంది నిర్లక్ష్యం దక్షిణ డిస్కంకు తలనొప్పిగా మారింది.రెండువారాల నుంచి వస్తున్న ఫిర్యాదులను చూస్తే సిబ్బంది పట్టించుకోవడం లేదని, ఫోన్‌చేస్తే కలవడం లేదన్న ఫిర్యాదులే ఉన్నాయి.
డిస్కంలలో ట్రాన్స్ఫార్మర్ల కొరత..
సమ్మర్లో వినియోగదారులు ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడం ద్వారా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిస్కంలో ఈ సారి ట్రాన్స్ఫార్మర్ల కొరత విపరీతంగా ఉందని వినియోగదారులు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. తాము కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలంటూ డీడీలు కట్టినప్పటికీ ఆర్డర్ ప్రకారం ఆరువందల నంబర్ నడుస్తున్నదని.. గత సంవత్సరం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో 886 డీటీఆర్లు చెడిపోగా.. ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులకు సగటున 8 గంటల 42 నిమిషాల సమయం పట్టినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యపై ఇప్పటివరకు దక్షిణ డిస్కంలో పరిష్కారం కనిపించడం లేదు. ఒకవైపు స్టోర్స్‌లో ట్రాన్స్ఫార్మర్ల కొరత, మరోవైపు మరమ్మతులకు గంటల కొద్దీ టైం కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోనే కాకుండా దక్షిణ డిస్కం పరిధిలో ఉన్న చాలా ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే స్టోర్స్‌లో మొత్తం సామగ్రి ఉందంటూ అధికారులు చెబుతున్నా.. వాళ్ల ఆఫీసుల్లో గోడలపై ఎంతెంత సామగ్రి స్టాక్ ఉందో బోర్డులపై రాసుకున్నా.. స్టోర్లలో మాత్రం ఆ పరిస్థితి లేదని వినియోగదారులు చెబుతున్నారు.