వనస్థలిపురం, ఏప్రిల్ 30 : ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెరికివేయాలని పలువురు సీనియర్ సిటిజన్స్ అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ విజయపురి కాలనీ ఫేస్ 1 సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన అమరులకు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలన్నారు.
అమాయకుల ప్రాణాలు తీస్తూ విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్ర మూకల ఆట కట్టించాలన్నారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవికె. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి విజయ సారథి, కార్యవర్గ సభ్యులు, మాణిక్య ప్రభు, ఏవి ప్రసాద్, లక్ష్మణ రావు, కోశాధికారి జివి రమణయ్య, అడ్వైజర్ ఎం ఏ .బేగ్ తదితరులు పాల్గున్నారు.