సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో రెండు చోట్ల దాడులు నిర్వహించి 15 నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ కథనం ప్రకారం.. చేవేళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి, మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌ల్లో పర్మిషన్ లేకుండా మద్యం వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీ, హర్యానా, గోవా నుంచి తెచ్చిన ఏడు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్‌కు అనుమతి తీసుకోకపోవడంతో ఫాంహౌస్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి తెచ్చిన మద్యం బాటిళ్లను ఘట్కేసర్లో విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు లక్ష్మిరెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు
అప్పగించారు.