బంజారాహిల్స్, ఏప్రిల్ 22: ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ డివిజన్లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మాగంటి కార్యాలయానికి వచ్చి తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు చేశారు.
గత పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీళ్లు వచ్చాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు నీటికష్టాలు మొదలయ్యాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక బస్తీల్లో లో ఫ్రెషర్ సమస్యలు ఉండటంతో విధిలేని పరిస్థితిలో మోటార్ల ద్వారా నీటిని పట్టుకుంటుంటే జలమండలి అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు బస్తీల్లోకి వచ్చి వాటిని సీజ్ చేస్తున్నారని మహిళలు వాపోయారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. జలమండలి అధికారులు సరిపోయినన్ని నీళ్లు ఇస్తే మోటార్లు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కొండలు, గుట్టలుగా ఉన్న పలు బస్తీల్లో మోటార్లు పెట్టడం కొత్తేమీ కాదని, మోటార్లు పెట్టకుంటే ఎవరికీ నీళ్లు రావని అన్నారు. ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నగరాన్ని సమస్యల్లో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీల్లో మోటార్లు సీజ్ చేయడానికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా అందించలేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.