హైదరాబాద్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ పేరుతో సైబర్ నేరగాళ్లు (Cyber Crime) సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ నుంచి రూ.1.60 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన ఆయేషా షరీఫ్ అనే గృహిణికి టెలిగ్రామ్ ద్వారా గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ పేరుతో ఓ లింక్ పంపించారు. ఆ లింక్ తెరవగానే ఆయేషా ఖాతాలోకి డబ్బులు జమయ్యాయి. తక్కువ పెట్టుబడితో రెంట్టింపు నగదు వస్తుందని నమ్మించారు.
దీంతో ఆమె ఒకేసారి రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే రెట్టింపు దేవుడెరుగు.. రోజులు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించారు. దీంతో కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.