మారేడ్‌పల్లి, ఏప్రిల్ 1: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ. 37,50,000 నగదు పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన పి. లక్ష్మణ్ రామ్ ఆదివారం రైలులో వచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ప్లాట్ఫారం నంబర్-1 నుంచి బ్యాగ్‌తో వస్తున్న లక్ష్మణ్రామ్ను రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. అతడి వద్ద ఉన్న బ్యాగ్‌లో ఉన్న రూ.37,50,000 నగదు బయటపడింది. ఈ నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. రైళ్లలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు రవాణా చేసే సమయంలో సరైన పత్రాలతో తీసుకెళ్లాలని రైల్వే పోలీసులు సూచించారు.