సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో ఆచూకీ తెలియని ముగ్గురు కూలీలు సజీవ దహనమయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో శుక్రవారం సైతం భవనంలో నిప్పు రవ్వలు కనిపించాయి. దీంతో అధికారులు భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా, ఆ వేడికి లోపలికి వెళ్లలేకపోయారు. ముగ్గురు యువకుల గల్లంతుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. అయితే వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ అక్కడే ఆగిపోవడం, సెల్ఫోన్లు స్విచాఫ్ అయి ఉండటం, భవన యజమాని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఆ ముగ్గురు ఆ భవనంలో ఉంటే ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మండుతున్న ఆ భవనంలో మృతదేహాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. వాటితో మంటల్లో అంటుకున్న భవనంలోని ఫ్లోర్లను పరిశీలించారు. డ్రోన్‌తో తీసిన ఫొటోలు, వీడియోలను విశ్లేషించడంతో అందులో కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. అవి గల్లంతైన వారి మృతదేహాలకు సంబంధించిన అనవాళ్లు కావచ్చని భావిస్తున్నారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, డ్రోన్లను ఉపయోగించామని, డ్రోన్లలోనూ ఎలాంటి మృతదేహాలను గుర్తించలేదని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు.
మినిస్టర్ రోడ్డులోని డెక్కెన్ మాల్ ప్రమాద ఘటనపై రాంగోపాల్‌పేట్ పోలీసులు భవన యజమానులు మహమ్మద్ ఒవైసీ, ఎంఏ రహీంలపై కేసు నమోదు చేశారు. గురువారం మొదటి అంతస్థులో ఉన్న సామాగ్రిని దించేందుకు ఏడు మంది లోపలికి వెళ్లారు. అందులో నలుగురిని అగ్నిమాపక శాఖ అధికారులు సురక్షితంగా కాపాడారు. మరో ముగ్గురు గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌లు భవనంలోనే చిక్కుకుపోయినట్లుగా భవన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకొని గుజరాత్ నుంచి గల్లంతైన ముగ్గురి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండేండ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఈ ముగ్గురు యువకులు, గురువారం వేరే దగ్గర పనిచేయాల్సి ఉండగా, వారి యజమాని డెక్కెన్ మాల్‌కు పంపించాడు. దీంతో అనుకోని ఘటనలో ఆ ముగ్గురు చిక్కుకున్నారని యజమాని పోలీసులకు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ తనిఖీ కేంద్రం ఉన్నతాధికారుల బృందం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘటన స్థలాన్ని పరిశీలించింది. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెను తిరిగారు. కాగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని స్థానిక విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే కరెంటు సరఫరా ట్రిప్ అయ్యేదని, సబ్ స్టేషన్‌కు ఆ విషయం తెలిసేదని అన్నారు. మంటలు అంటుకున్న కాసేపటి వరకు కూడా మీటర్‌కు కరెంటు సరఫరా జరిగిందని చెప్పారు.
ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు హైదరాబాద్ క్లూస్ టీమ్ హెడ్, సైంటిస్ట్ వెంకన్న నేతృత్వంలో బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. అయితే లోపలికి వెళ్లి ఆధారాలు సేకరించలేక పోయారు.
ప్రమాదానికి భవనం పరిస్థితి ఏమిటనే విషయంపై అధికారులు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు పరిశీలించారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, భయట నుంచే పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటన, భవనం బీటలు వారడం, ఇంకా అగ్గి చల్లారకపోవడంతో భవనం కూల్చివేయాల్సిందేనని తెలిపారు.
భవనం కూల్చివేతపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. నిట్ బృందం సమగ్ర నివేదిక అందిన వెంటనే ఈ రిపోర్టును పరిగణలోకి తీసుకుకొని శనివారం ఉదయం నుంచే కూల్చివేసేలా చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్టు స్థలాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసేందుకు వినియోగించిన లాంగ్రిచ్ ఎక్స్‌కావేటర్ యంత్రాన్ని ఇక్కడ ఉపయోగించాలని నిర్ణయించారు.
ఘటనాస్థలాన్ని హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ పరిశీలించారు. బిల్డింగ్ లోపల శుక్రవారం ఉదయం కూడా మంటలు అదుపులోకి రాలేదని ఫైరింజన్ల సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. లోపలి నుంచి పొగ, వేడి వస్తుండటంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. బిల్డింగ్ లోపల డెడ్ బాడీస్ ఉన్నాయో లేదో ఇప్పుడే చెప్పలేమని, వేడి పూర్తిగా తగ్గాక బిల్డింగ్‌ను కూల్చడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పరిసర ప్రాంతాల వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక పరిహారం గురించి ఆలోచిస్తామన్నారు.
మూసాపేట, జనవరి 20 : కూకట్పల్లి అమోరు దవాఖానలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే తేరుకున్న సిబ్బంది దవాఖానలోని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అగ్నిప్రమాదానికి గురైన భవనం ఎప్పుడైన కుప్పకూలే ప్రమాదమున్నదని అటు వైపు ఎవరూ వెళ్లవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఎన్ఐఐటీ, వరంగల్ డైరెక్టర్ రామణారావు, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా భవనాన్ని పరిశీలించామన్నారు. భవనం పూర్తిగా దెబ్బతిన్నదని, కొన్ని శ్లాబ్‌లు కూడా కిందపడటం, పగుళ్లు రావడంతో ఆ భవనాన్ని ఉపయోగించవద్దని సూచించారని డీసీపీ తెలిపారు. బిల్డింగ్ ఎప్పుడైనా కుప్పకూలే అవకాశమున్నందున ఇరుగు పొరుగు భవనాలలో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించామన్నారు.
డక్కన్ మాల్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ నెల 23న అన్ని శాఖల ఉన్నతాధికారులతో నగరంలోని వాణిజ్య భవనాలకు అనుమతులు, ఇతర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ శుక్రవారం తెలిపారు. జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ ఇతర అధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నామని, నగరంలోని వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు, ఫైర్ అనుమతులు ఇతర అంశాలపై చర్చించనున్నట్టు అర్వింద్‌కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.