బేగంపేట్, జూలై 4: బోనాల ఉత్సవాలు వైభవంగా జరగాలని పలు ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణానే అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా వివిధ దేవాలయాలకు అందించే ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని 167 దేవాలయాల నిర్వాహకులకు రూ. కోటి 13 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ముందుగా అమ్మవారికి బోనాల సందర్భంగా సమర్పించనున్న చీర తయారీ పనులను మగ్గంపై నేత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను అనేక దేశాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని ఇది మనకెంతో గర్వ కారణమని అన్నారు.
ఈ బోనాలను ఎన్నో ఏండ్ల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వ, ప్రైవేట్ దేవాలయాలు అనే తేడా లేకుండా అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం 15 కోట్లను విడుదల చేసిందని చెప్పారు.
ఉత్సవాలకు వారం ముందే ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 9న లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముందస్తుగానూ ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. 16వ తేదీన హైదరాబాద్ బోనాలను నిర్వహించే ఆలయాలకు 10, 11 తేదీలలో ఆర్ధిక సహాయం చెక్కులను అందిస్తామని వివరించారు. బోనాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.
వివిధ ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ ధధ్వర్యంలో భక్తులను ఆహ్లాదపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మీ, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ అరుణ గౌడ్, శేషు కుమారి, దేవాదాయ శాఖ అధికారులు కృష్ణ, దేవాలయం ఈవో గుత్తా మనోహార్రెడ్డి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించండి
బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి తలసాని మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ (లష్కర్) బోనాలు, 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజా ప్రతిఇనధులు ఏర్పాట్లలో భాగస్వాములై పర్యవేక్షణ జరపాలని చెప్పారు. ఇంకా ఏమైనా ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. భక్తులు క్యూ లైన్లలో తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బంద్బస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బోనాలు తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శద్ద్ర చూపాలని మంత్రి తలసాని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మైనంపల్లి హన్మంతరావు, వివేక్, అరికెపూడి గాంధీ తదితరులు మంత్రి తలసానితో మాట్లాడారు.