నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్ దవాఖానల్లో ఓపీలో 60 శాతం రోగులు జలుబు, జ్వరం వంటి లక్షణాలతోనే బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా కేసులు కూడా స్వల్పంగా నమోదవుతున్నాయన్నారు. గాలిలో తేమ శాతం పెరగడంతో వాతావరణం చల్లబడి, అందులో ఉన్న వైరస్ల వ్యాప్తి పెరగడంతో వైరల్ ఫీవర్స్ వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు నిలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్ కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఓపీలో 15శాతం కేసులు జలుబు, జ్వరం, తదితర వైరల్ ఫీవర్తోను, 9శాతం నిమోనియా కేసులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. చల్లదనం, వర్షంలో తడవడం, వాతావరణంలో మార్పులు తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
పెరుగుతున్న ఓపీ ..
మూడు నాలుగు రోజులుగా రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు భారీగా క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగుల రద్దీ పెరుగుతుంది. సాధారణం కంటే 20 శాతం ఓపీ పెరిగినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కేసులు పెద్దగా పెరగనప్పటికీ, స్థానికంగా ఉండే బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్సీలలో మాత్రం జ్వర పీడితులకు సంబంధించిన ఓపీ పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు పాటించాలి
– డాక్టర్ రమేశ్ దాంపురి, నిలోఫర్ మాజీ ఆర్ఎంవో
వాతావరణం చల్లబడడం వల్ల వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం సాధారణమే. పిల్లలు ఎక్కువగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కు గురవుతుంటారు. ఈ సీజన్లో నిమోనియా కేసులు కూడా పెరుగుతుంటాయి. ఐదేండ్ల లోపు వయస్సు పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. చల్లదనంలో పిల్లలను బయట తిప్పడం, పిల్లలను తీసుకుని చలి గాలిలో, వర్షంలో బయటకు వెళ్లడం చేయకూడదు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే పిల్లలు వర్షంలో తడవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చని దుస్తులు, చెవులకు టోపీలు వంటివి వేయాలి. పిల్లలు అనారోగ్యానికి గురైతే వైద్యులను సంప్రదించాలి. యాంటీబయాటిక్స్ వాడకూడదు.
ఆందోళన అవసరం లేదు
-డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణమే. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటి కేసులు నమోదవుతుంటాయి. దోమల కారణంగా డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి కేసులు కూడా నమోదవుతుంటాయి. గతంతో పోలిస్తే ఈ సారి ఈ కేసులు చెప్పుకోదగినంతగా నమోదు కాలేదు. రోజువారి ఓపీ కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ గడిచిన మూడు నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలతో రోగులు వస్తున్నారు. ఇవి వైరల్ ఫీవర్స్ లక్షణాలే. ఈ కేసులు స్థానిక బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో స్వల్పంగా పెరుగుతున్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మందులిచ్చే నాథుడే లేడు!
సీజనల్ వ్యాధులతో ఏరియా దవాఖానల మెట్లెక్కే వారికి సత్వర వైద్యమందక నానా ఇబ్బందులు పడుతున్నారు. రక్త , మూత్ర పరీక్షలకోసం గంటల తరబడి ఎదురుచూసున్న వైనం నగరంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో కనిపిస్తుంది. మందుల కోసమని వెళ్తే ఫార్మసిస్టుల కొరత కారణంగా గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఏరియా ఆసుపత్రుల్లో నేటికి సిబ్బంది కొరత వెంటాడుతుంది. ఉన్నవారిపైనే అధిక భారం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో సకాలంలో వైద్యమందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫార్మసీల ముందు బారులు..
నాంపల్లి, మలక్‌పేట, గోల్కొండ ప్రాంతాల్లో ఉన్న వంద పడకల ఏరియా దవాఖానలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తూ బస్తీ, యూపీహెచ్సీల తరువాత వైద్యసేవలందిస్తుండటం గమనార్హం. సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ మెడిసిన్, సర్జన్, ఫార్మసిస్టు, రేడియాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నా యి. నాంపల్లిలో ఉన్న గ్రేడ్ వన్ ఫార్మసిస్టు గజ్వేల్‌కు బదిలీ కావడంతో ఖాళీ ఏర్పడింది. మలక్‌పెట్ లో నలుగురు అవసరమవుతుండగా ఒక్కరే ఉన్నారు. గోల్కొండలో సైతం ఒక్క ఫార్మసిస్టు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. రోగులు ఫార్మసీల ముందు బారులు తీరుతున్నారు.
రేడియాలజిస్టులు లేక ఇక్కట్లు..
ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ వంటి పరికరాలు ఉన్నప్పటికి పరీక్షలు నిర్వహించే రేడియాలజిస్టులు లేకసకాలంలో టెస్టులు నిర్వహించలేకపోతున్నారు.