మన్సురాబాద్, జూన్ 28: ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమలు వృద్ధిని అరికట్టవచ్చునని మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఎంటమాలజీ శాఖ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ కాస్మోపాలిటన్ కాలనీలోని శ్రీ చైతన్య భారతి హై స్కూల్లో నిర్వహించిన సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. మొక్కలను పెంచే తొట్లు, పాత టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలలో వర్షపు నీరు చేరి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు.
నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారానే దోమలను నివారించ వచ్చునన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కల్పించుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమానికి విద్యార్థులు దోమ వేషధారణతో వచ్చి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్ల కార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్, చంద్రిక, రమేష్, ఎంటమాలజీ ఏఈ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.