సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం మొదలైనా వైద్య ఆరోగ్యశాఖలో కదలిక లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యచరణ లేదు. అసలే ఒక పక్క కరోనా కలకలం రేపుతున్న సమయంలో సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అయోమయం నెలకొనే పరిస్థితి లేకపోలేదు. సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు కార్యాచరణను రూపొందించాలి.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దవాఖానల్లో అవసరమైన ఔషధాలు, కావాల్సిన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీజనల్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ వానాకాలం ప్రారంభమైనా ఆరోగ్యశాఖ అధికారులు సీజనల్ను ఎదుర్కొనే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు బస్తీ దవాఖానలు సహా పలు ఇతర ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత సైతం వేధిస్తున్నట్లు స్వయంగా సిబ్బందే చెప్పడం గమనార్హం. దీనిని కొందరు అధికారులు కూడా బహిరంగంగానే ధ్రువీకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాధుల బెడద లేని సమయంలోనే ఔషధాల కొరత వేధిస్తుంటే, రానున్న సీజనల్ను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థంగా మారింది.
దేశమంతా కరోనా కేసులు చాపకింద నీరులా నమోదవుతున్నాయి. కానీ గ్రేటర్లో మాత్రం కేసులు నమోదు కావడం లేదు. ఇది శుభపరిణామమే. అసలు విషయమేంటంటే అసలు కరోనా టెస్టులు చేస్తే కదా కేసులు బయటపడేది. నగరంలో కరోనా పరీక్షలు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో చేయకపోవడంతో అసలు కేసులు నమోదుపై స్పష్టత లేదు.