కంటోన్మెంట్, అక్టోబర్ 19: మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల కోసం నగరంలోనే మొట్టమొదటి సైన్స్ ల్యాబ్ అండ్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటవుతోంది. కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ బోర్డు పరిధిలోని దశబ్ధాల నాటి తాడ్బంద్ ప్రభుత్వ పాఠశాలను, స్థలాన్ని నగరంలోని అక్షయ విద్యా ఫౌండేషన్‌కు లీజుకు ఇవ్వడంతో సర్ సీవీ.రామన్ పేరుతో సైన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటిరియల్తో సైన్స్ ల్యాబ్‌లుగా మారుస్తున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని పునరుద్ధరించి పాఠశాల వరండాతోపాటు తరగతి గదుల్లో సైన్స్, టెక్నాలజీని ప్రతిబింబించే సైన్స్ ఆధారిత ఇతివృత్తాలు, చిత్రాలతో అక్షయ విద్యా ఫౌండేషన్ సంస్థ పేయింటింగ్ వేయించింది. ఈ సైన్స్‌ల్యాబ్, సైన్స్ టెక్నాలజీ ద్వారా పేద విద్యార్థులు వారి ఆలోచనలకు అణుగుణంగా ఆచరణాత్మక ప్రయోగాలు చేసేందుకు ఈ పాఠశాల్లో అవకాశం కల్పిస్తున్నారు. సైన్స్ ల్యాబ్, టెక్నాలజి సెంటర్లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి శిక్షణ పొందిన అధ్యాపకులను నియమిస్తున్నారు.
కార్పొరేట్ స్థాయిలో సైన్స్‌ల్యాబ్ టెక్నాలజీ సెంటర్
కార్పోరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యాధునిక సైన్స్, టెక్నాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సైన్స్‌ల్యాబ్ వల్ల విద్యార్థులు ఆచరణాత్మక ప్రయోగాలు చేసేందుకు వసతులు అంతంత మాత్రమే ఉంటున్నాయి. కాగా ఆ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పేద విద్యార్థులకు అందుబాటులో అక్షయ విద్యా ఫౌండేషన్ తాడ్బంద్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు సంస్థ విశేషంగా కృషి చేస్తోంది.
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం: వరప్రసాద్
నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై తాడ్‌బంద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న సర్ సీవీ.రామన్ సైన్స్, అండ్ టెక్నాలజీ ల్యాబ్ చిరునామాగా మారనుంది. సుమారు కోటిన్నర రూపాయలను వెచ్చించి అన్ని తరగతి గదులను సైన్స్ల్యాబ్గా మార్చాం. పాఠశాల తరగతి గదులతోపాటు వరండాలో సైన్స్, టెక్నాలజీతో కూడిన చిత్రాలను పేయింటింగ్ చేయించాం. పాఠశాల ఆవరణలో పేరుకపోయిన పిచ్చిమొక్కలను తొలగించి, చదును చేయించి అన్ని వసతులు కల్పించాం. నగరంలోనే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. ఈ నెల 22న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కంటోన్మెంట్ బ్రిగేడియర్ రాజీవ్, సీఈవో మధుకర్ నాయక్, నగర సీపీ సజ్జనార్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా సైన్స్, టెక్నాలజీ ల్యాబ్ సెంటర్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నాం.