చాంద్రాయణగుట్ట, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ): రాజకీయ బలంతో చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మించి, అందులో విద్యాలయాలు నిర్వహించే వారికో న్యాయం… సాధారణ భవనాల్లో పాఠశాల నిర్వహించే వారికి మరో న్యాయం.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. పాతబస్తీ బాబానగర్‌లోని ఆర్నా గ్రామర్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో అకస్మాత్తుగా జీహెచ్ఎంసీ సిబ్బంది బుల్డోజర్లతో వచ్చి స్కూల్ భవనాన్ని కూల్చేశారు.. దీంతో లోపల ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటకు పరుగులు తీశారు.. భూకంపం వచ్చినట్లు ఒక్కసారిగా జీహెచ్ఎంసీ సిబ్బంది బుల్డోజర్లతో స్కూల్ భవనంపై విరుచుకుపడడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
విద్యార్థుల పుస్తకాలు, బెంచీలు కొన్ని బయట పడేసినా.. మరికొన్ని కూల్చేసిన శిథిలాల కిందే పోయాయి… హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో చెరువుల కబ్జాపై చర్యలు తీసుకుంటామంటూ గొప్పలు చెప్పుకున్నారు… అదే చెరువులో కట్టిన ఫాతిమా స్కూల్ విషయంలో హైడ్రా అధికారులు వెనుకడుగు వేశారు.. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నారని… ఎండకాలం సెలవుల్లో ఆ భవనాన్ని కూల్చేస్తామని ప్రకటించారు.. ఆ తరువాత మళ్లీ మాట మార్చి… అటు వైపు కూడా చూడలేదు.. సీన్ కట్ చేస్తే అదే మైనారిటీ విద్యార్థులు చదువుతున్న ఆర్నా గ్రామర్ స్కూల్ విషయంలో మాత్రం ఏ మాత్రం నియమ నిబంధనలు పాటించకుండా.. కనీసం నోటీసులు జారీ చేయకుండా అకస్మాత్తుగా వచ్చి విద్యార్థులు పాఠశాలలో ఉండగానే జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు.. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు ఒక రకంగా సామాన్యులకు మరో రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
పాతబస్తీ బాబానగర్‌లో ఆర్నా గ్రామర్ స్కూల్ విద్యార్థులు శనివారం ఉదయం పాఠశాలకు హాజరయ్యారు. 7వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇతర విద్యార్థులు ఎవరి తరగతి గదుల్లో వాళ్లు ఉన్నారు. ఉపాధ్యాయులు తరగతుల్లో పాఠాలు చెబుతున్నారు. యాజమాన్యం తమ కార్యాలయంలో పాఠశాల వ్యవహారాలను పరిశీలిస్తున్నది. ఇంతలో మున్సిపల్ అధికారులు అక్కడకు వచ్చి కూల్చివేతలు చేపట్టారు. ‘మాకు కొంత సమయం ఇవ్వండి, పిల్లలను ఇండ్లకు పంపించేస్తాం’ అంటూ టీచర్లు జీహెచ్ఎంసీ అధికారులను వేడుకున్నారు. అయినా ఎవరు పట్టించుకోకుండా స్కూల్ విద్యార్థులను బయటకు వెళ్లాలంటూ బెదిరించి బయటకు పంపించారు. తరగతి గదిలో ఉన్న బెంచీలను కొన్ని బయట పడేశారు. విద్యార్థుల పుస్తకాలు చాలా వరకు తరగతి గదిలోనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా తమ వెంటనే తెచ్చుకున్న బుల్డోజర్లతో స్కూల్ భవనంపై విరుచుకుపడ్డారు.
బాబానగర్ మీదుగా బాలాపూర్ వైపు ప్రయాణించే రోడ్డు మార్గం గతంలో 30 అడుగులు ఉండేది. ఈ రోడ్డును 100 అడుగుల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లకు నోటీసులు ఇచ్చి కూల్చివేశారు. అయితే ఆర్నా గ్రామర్ హైస్కూల్ నిర్వాహకులు తమకు కొంత సమయం కావాలని, పాఠశాలను కొనసాగిస్తుండడంతో తాము మరో చోటికి తరలించాలంటే కొన్ని కష్టనష్టాలు ఉన్నాయంటూ అధికారులతో మొరపెట్టుకున్నారు. రోడ్డు విస్తరణతో తమ ఆస్తిని కోల్పోతున్నామని, తమకు తగిన నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని, జీహెచ్ఎంసీ ఇచ్చే నష్టపరిహారం పెంచాలని అప్పటి వరకు పాఠశాల భవనాన్ని కూల్చవద్దంటూ స్కూల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో పాఠశాలను కూల్చివేయవద్దని కోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను ఎత్తివేయాలంటూ జీహెచ్ఎంసీ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయం కోర్టులో నడుస్తుండగానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చివేతలు చేపట్టడంతో తాము షాక్‌కు గురయ్యామని పాఠశాల యజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ కోర్టు స్టే అర్డర్ ఎత్తేస్తే, తమకు నోటీసులు ఇచ్చి కూల్చేయాల్సి ఉన్నా కనీస నిబంధనలు పాటించకుండా పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిన జీహెచ్ఎంసీపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. రూ.లక్షల విలువగల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చి కూల్చివేయడం ఎంతో ఆందోళన కలిగించింది. స్కూల్ విద్యార్థులను బయటకు పంపించే సమయం కూడా ఇవ్వలేదు, ప్రత్యామ్నాయం చూపలేదు, మేం ప్రత్యామ్నాయం చూసుకునే వరకు ఆగాలని కోరినా పట్టించుకోలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, పిల్లల పుస్తకాలు బయటకు తీసుకురాకుండా చేశారు. ఇది విద్యా మందిరం. ఇలా ఎక్కడా జరగకూడదు, ఇంత నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేసింది, ఇది క్షమించరాని నేరం. విద్యార్థులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.