శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 7 : అభం శుభం తెలియని చిన్నారి పట్ల స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మూడు రోజుల తర్వాత మూత్ర విసర్జన చేసే చోట నొప్పిగా ఉందని సదరు చిన్నారి తన తల్లికి చెప్పడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చిన్నారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఈ నెల 4 తేదీన విహారయాత్రకు తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని సిరి నేచురల్ రిసార్ట్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ చిన్నారి మూత్రం వస్తుందని ఇంచార్జి ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆమె బస్సు డ్రైవర్ జోసెఫ్ రెడ్డిని తోడుగా ఇచ్చి పంపించింది. అదే సమయంలో సదరు డ్రైవర్ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత రోజు మాదిరిగా చిన్నారి పాఠశాలకు వచ్చి వెళ్తోంది. ఈ క్రమంలో మూత్ర విసర్జన చేసే చోట నొప్పి పెడుతుందని తల్లికి చిన్నారి చెప్పింది. దీంతో ఏమైందని ఆరా తీయగా.. బస్ డ్రైవర్ చేసిన అఘాయిత్యాన్ని తల్లికి వివరించింది.
చిన్నారి చెప్పిన విషయంలో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు.. పాపను తీసుకుని పాఠశాలకు వచ్చారు. అక్కడ అఘాయిత్యం చేసింది ఎవరని అడగ్గా.. డ్రైవర్ జోసెఫ్‌ను చూపించింది. దీంతో జరిగిన విషయం యాజమాన్యానికి చెప్పగా.. వారు కూడా రకరకాలు మార్చి అందరు డ్రైవర్లను చిన్నారికి చూపించి అడిగారు. అయినప్పటికీ చిన్నారి ఎలాంటి కంగారు లేకుండా ఒకే డ్రైవర్‌ను చూపించింది. దీంతో సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వారు వినిపించుకోకపోవడంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలిసిన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు కూడా పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. విద్యార్థి సంఘాల ధర్నా నేపథ్యంలో పాఠశాలకు వచ్చిన పోలీసులు.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని అరెస్టు చేసి మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.